క్రీడల్లో గెలుపు–ఓటములు సహజం, క్రీడా స్ఫూర్తే ముఖ్యం : మంత్రి వాకాటి శ్రీహరి
గెలుపులో ఆనందాన్ని, ఓటమిలో పాఠాలను జీవితానికి మార్గదర్శకంగా చేసుకోవాలి : మంత్రి సీతక్క
69వ జాతీయస్థాయి అండర్–17 బాలుర కబడ్డీ పోటీలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం గ్రామంలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల ఆవరణలో బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో, కంది చారిటబుల్ ట్రస్ట్, మౌర్య టెక్ సౌజన్యంతో నిర్వహిస్తున్న ఈ జాతీయస్థాయి క్రీడా పోటీలను రాష్ట్ర పశుసంవర్ధక, పాడి అభివృద్ధి & మత్స్య, క్రీడలు & యువజన సేవల శాఖ మంత్రి వాకాటి శ్రీహరి, పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా & శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, భద్రాచలం ఐటిడిఏ పీఓ రాహుల్ తదితరులు ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా జాతీయస్థాయి కబడ్డీ పోటీల ప్రారంభోత్సవానికి జిల్లాకు విచ్చేసిన మంత్రులు వాకాటి శ్రీహరి, ధనసరి అనసూయలకు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఘన స్వాగతం పలికారు. అనంతరం మణుగూరు ప్రధాన కూడలి నుంచి సీఎం టార్చ్ ర్యాలీని మంత్రి వాకాటి శ్రీహరి ప్రారంభించారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో క్రీడాకారులు, యువకులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ఏడూళ్ల బయ్యారం జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల ఆవరణలో జ్యోతి ప్రజ్వలన చేసి జాతీయ పతాకాన్ని మంత్రులు ఆవిష్కరించారు. జాతీయ కమిటీ పోటీల సందర్భంగా చిన్నారుల నృత్య ప్రదర్శన అందరి ని ఆకట్టుకుంది.అనంతరం బెలూన్లను గాలిలోకి వదిలి జాతీయ కబడ్డీ పోటీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి వాకాటి శ్రీహరి మాట్లాడుతూ దేశం నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులను ఉద్దేశించి “ఈస్ట్ ఆర్ వెస్ట్ – ఇండియా ఇస్ ది బెస్ట్, ఈస్ట్ ఆర్ వెస్ట్ – బయ్యారం ఇస్ ది బెస్ట్, భారత్ మాతాకీ జై” అంటూ నినాదాలు ఇచ్చారు. ఈ క్రీడా సంభరం చూస్తే సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చినట్లుగా ఉందన్నారు. కబడ్డీ అనేది మన దేశంలోనే పుట్టిన సంప్రదాయ క్రీడ అని, మన మట్టిలో పుట్టిన ఈ ఆటలు మన సంస్కృతి, సువాసనను ప్రపంచానికి చాటుతాయని అన్నారు. కబడ్డీ చెమటతో, శ్రమతో ఆడే క్రీడ అని, గెలుపు–ఓటములు సహజమని, ప్రతి క్రీడాకారుడు క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని సూచించారు. దేశ చరిత్రలో తొలిసారిగా మారుమూల గిరిజన ప్రాంతమైన ఏడూళ్ళ బయ్యారం గ్రామంలో జాతీయస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం గర్వకారణమన్నారు. ఈ పోటీల ద్వారా బయ్యారం గ్రామం పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతుందని తెలిపారు. వాజపేయి ప్రధానమంత్రి గా వున్న కాలంలో భారత్–పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా “గెలుపు–ఓటములకన్నా మనసులు గెలుచుకొని రావాలి” అన్న సందేశాన్ని గుర్తు చేస్తూ, బయ్యారానికి వచ్చిన క్రీడాకారులు కూడా ఇక్కడి ప్రజల మనసులు గెలుచుకొని వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.
మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) మాట్లాడుతూ జాతీయస్థాయి కబడ్డీ పోటీలను బయ్యారం గ్రామంలో నిర్వహించేందుకు బాధ్యత తీసుకున్న కంది చారిటబుల్ ట్రస్ట్ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ క్రీడా పోటీల నిర్వహణ కోసం వారు సుమారు ఆరు నెలల పాటు శ్రమించి, ఏర్పాట్ల నుంచి ఆతిథ్యం వరకు సమర్థవంతంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులు గెలుపు–ఓటములను సమానంగా స్వీకరించి, అనుభవాన్ని సొంతం చేసుకోవాలని సూచించారు. చిన్నపాటి తప్పిదాలతో ఓడిపోయినప్పుడు నిరాశ చెందకుండా, గెలుపు ఇచ్చే ఆనందాన్ని, ఓటమి ఇచ్చే పాఠాలను జీవితానికి తీసుకెళ్లాలని తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన చిన్నారులందరికీ ఆమె హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మారుమూల గిరిజన ప్రాంతమైన బయ్యారంలో జాతీయస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించటం ఎంతో సంతోషకరమన్నారు. గ్రామీణ స్థాయిలో యువతలో క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఈ తరహా పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఇప్పటికే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను విజయవంతంగా నిర్వహించామని, అదే విధంగా జాతీయస్థాయి పోటీలను కూడా సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అన్ని విధాలా సహకరిస్తోందన్నారు.
జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ దేశం నలుమూలల నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వచ్చి జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు ఇది మరచిపోలేని అనుభవంగా నిలుస్తుందని అన్నారు. ఈ పోటీల ద్వారా జిల్లా ఖ్యాతి దేశవ్యాప్తంగా మరింతగా పెరుగుతుందని, క్రీడల నిర్వహణలో జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి నాగలక్ష్మి, క్రీడా శాఖ అధికారి పరందామరెడ్డి, టోర్నమెంట్ అబ్జర్వర్ నిర్మల్ జంగ్డే,సర్పంచ్ చందర్రావు, కంది చారిటబుల్ ట్రస్ట్ సుబ్బారెడ్డి, విశ్వ భరత్ రెడ్డి, తాసిల్దార్ గోపాల కృష్ణ, ఎంపీడీవో సంకీర్ , ఎంపీఓ వెంకటేశ్వర రావు, క్రీడా శాఖ అధికారులు, విద్యాశాఖ అధికారులు, విద్యార్థులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
