పనుల పురోగతిపై అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం
నాగర్ కర్నూల్ జనవరి 2,(ఎస్ బి న్యూస్):
నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ దేవ సహాయంతో కలిసి కొండారెడ్డిపల్లి గ్రామ అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల ద్వారా అమలవుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై శాఖల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రతి అభివృద్ధి పనికి సంబంధించిన ప్రస్తుత స్థితి, ఎదురవుతున్న సమస్యలు, పూర్తయ్యే గడువు వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. ఇప్పటికే మంజూరైన అభివృద్ధి పనులన్నింటిపై ప్రత్యేక దృష్టి సారించి, గతంలో ప్రారంభించి మిగిలి ఉన్న పనులన్నింటినీ జనవరి 30 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
నూతనంగా మంజూరైన అభివృద్ధి పనుల టెండర్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని, గడువు మించి జాప్యం జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి శాఖకు చెందిన అధికారులు తమ పరిధిలోని పనులపై సమగ్ర నివేదికలు సమర్పించాలని, మిగిలి ఉన్న పనులను తక్షణమే ప్రారంభించి వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
గ్రామాభివృద్ధి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చే అంశమని, అన్ని అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత కాలంలో పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
గ్రామ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని, అభివృద్ధి పనుల్లో జాప్యం జరిగితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ చిన్న ఓబులేసు, జిల్లా పంచాయతీ అధికారి శ్రీరాములు, జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్, పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజయ్, మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుధాకర్ సింగ్, వంగూరు తహసీల్దార్, వంగూరు ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.
