కరకగూడెం మండల పరిధిలోని మోతే గ్రామంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనానికి జరిగిన ప్రయత్నం స్థానికంగా కలకలం రేపింది. గురువారం గుర్తు తెలియని దుండగులు వ్యవసాయ క్షేత్రంలోని ట్రాన్స్‌ఫార్మర్‌ను విడదీసి లోపల ఉండే విలువైన రాగి వైరును అపహరించేందుకు ప్రయత్నించారు. పొలాల వద్ద అనుమానాస్పద కదలికలను గమనించిన రైతులు వెంటనే పోలీసులకు, విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు, విద్యుత్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, అధికారుల రాకను ముందే పసిగట్టిన దొంగలు చీకటిని ఆసరాగా చేసుకుని అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ ఘటన నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు రైతులకు పలు కీలక సూచనలు చేశారు. రాత్రి సమయాల్లో పొలాల వద్ద ఉండే ట్రాన్స్‌ఫార్మర్ల విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద తచ్చాడుతూ కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా విద్యుత్ ఏఈకి సమాచారం అందించాలన్నారు. గ్రామస్తుల సహకారం ఉంటేనే ఇలాంటి చోరీలను అరికట్టడం సాధ్యమని అధికారులు పేర్కొన్నారు.
రైతులు సకాలంలో స్పందించడం వల్ల ప్రభుత్వ ఆస్తి చోరీకి గురికాకుండా తప్పిందని అధికారులు వారిని అభినందించారు. ప్రస్తుతం పోలీసులు పరారైన దుండగుల కోసం గాలిస్తున్నారు.
