Subscribe Us

SB LATEST:

25, డిసెంబర్ 2025, గురువారం

చదువు మధ్యలోనే ఆగిపోతున్న కలలు


చదువు ప్రతి పిల్లవాడి మౌలిక హక్కు అయినప్పటికీ, నేటి సమాజంలో అనేక మంది విద్యార్థులు వివిధ కారణాలతో చదువును మధ్యలోనే వదిలేస్తున్నారు. పేదరికం, కుటుంబ ఆర్థిక ఒత్తిళ్లు, తల్లిదండ్రుల అవగాహన లోపం, అలాగే పాఠశాలల్లో సరైన మార్గనిర్దేశం లేకపోవడం వంటి అంశాలు పిల్లలను బడికి దూరం చేస్తున్నాయి. చదువు కన్నా కూలి పని అవసరం అన్న భావన చిన్న వయసులోనే వారి కలలను మట్టిలో కలిపేస్తోంది.
చదువు మానేసిన విద్యార్థి కేవలం వ్యక్తిగత సమస్యగా మిగలడం లేదు. చదువుకు దూరమైన పిల్లలు ఖాళీగా ఉండటం వల్ల తప్పుదారి పట్టే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తోంది. కొందరు చిన్న వయసులోనే సిగరెట్, గుట్కా, మద్యం, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ ఆరోగ్యాన్ని, భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు.

ముంచుకోస్తున్న నష్టాలు

సరైన దారి చూపే వారు లేకపోవడం, పర్యవేక్షణ లోపం ఈ పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మారుస్తోంది.ఇలాంటి పరిస్థితులు కుటుంబ భవిష్యత్తుపై మాత్రమే కాకుండా సమాజంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.బాల కార్మిక వ్యవస్థ పెరగడం, యువతలో నిరుద్యోగం అధికమవడం, మత్తు పదార్థాల దుర్వినియోగం పెరగడం, కొందరు నేరాల వైపు మళ్లే ప్రమాదం ఇవన్నీ డ్రాపౌట్ సమస్యకు ప్రత్యక్ష ఫలితాలే. ఒక పిల్లవాడి చదువు ఆగిపోతే, సమాజం ఒక బాధ్యతగల పౌరుడిని మాత్రమే కాదు, ఒక ఆరోగ్యవంతమైన యువతను కూడా కోల్పోతుంది.ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఉన్నప్పటికీ, అవి లబ్ధిదారుల వరకు పూర్తిస్థాయిలో చేరడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

వారి మానసిక పరిస్థితిని గమనించి మెలగాలి

విద్యార్థిని కేవలం మార్కుల ఆధారంగా కాకుండా, మానసికంగా కూడా అర్థం చేసుకునే విధానం విద్యా వ్యవస్థలో బలపడాల్సిన అవసరం ఉంది. చదువు మానేసిన పిల్లలు మత్తు పదార్థాల బారిన పడకుండా ఉండాలంటే పాఠశాలలు, స్థానిక సంస్థలు, తల్లిదండ్రులు కలిసి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.డ్రాపౌట్ విద్యార్థుల సంఖ్య తగ్గాలంటే ఇది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా, సమాజం మొత్తానికి సంబంధించిన అంశంగా మారాలి. చదువు మానేసిన ప్రతి పిల్లవాడిని తిరిగి బడిలోకి తీసుకురావడమే కాకుండా, వారికి సరైన మార్గనిర్దేశం, కౌన్సెలింగ్, జీవన నైపుణ్యాలు అందించాలి. ఎందుకంటే చదువుతోనే వ్యక్తి ఎదుగుతాడు, ఆరోగ్యంగా ఉంటాడు, సమాజం మారుతుంది, దేశం ముందుకు సాగుతుంది.
మలిపెద్ది పవన్ కళ్యాణ్ జర్నలిస్ట్,వ్యాస రచయిత గుండాల 7093052815