Subscribe Us

SB LATEST:

25, డిసెంబర్ 2025, గురువారం

గిరిజన మ్యూజియం విద్యార్థులకు విజ్ఞానం–వినోదంప్రిన్సిపాళ్ల ప్రశంస

గిరిజన మ్యూజియం విద్యార్థులకు విజ్ఞానం–వినోదం
ప్రిన్సిపాళ్ల ప్రశంస
📍 భద్రాచలం | 24 డిసెంబర్ 2025
భవిష్యత్ తరాల విద్యార్థులకు చదువుతో పాటు విజ్ఞానం, వినోదాన్ని అందించడంలో గిరిజన మ్యూజియం కీలక పాత్ర పోషిస్తోందని పాల్వంచ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల, భద్రాచలం కోమల హై స్కూల్ ప్రిన్సిపాళ్లు డా. బి. ఝాన్సీ రాణి, పలివెల రవికుమార్ తెలిపారు.
బుధవారం ఐటిడిఏ ప్రాంగణంలోని గిరిజన మ్యూజియంను భద్రాచలం కోమల హై స్కూల్, పాల్వంచ గురుకుల డిగ్రీ కళాశాలకు చెందిన 550 మంది విద్యార్థులు, 12 మంది ఉపాధ్యాయులు సందర్శించారు. ఈ సందర్భంగా గిరిజనుల పాతకాలపు జీవన విధానం, ఆచారాలు, సంప్రదాయాలు, కళాఖండాలు, వినియోగ వస్తువులను విద్యార్థులు ఆసక్తిగా పరిశీలించారు.
మ్యూజియంలో ప్రతి అంశాన్ని తెలుగులో వివరించడం వల్ల గిరిజనుల చరిత్ర, సంస్కృతి విద్యార్థులకు సులభంగా అర్థమైందని ప్రిన్సిపాళ్లు పేర్కొన్నారు. అంతరించిపోతున్న గిరిజన సంస్కృతి, కోయ భాష పరిరక్షణకు ఐటిడిఏ భద్రాచలం పీఓ బి. రాహుల్ చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు.
అలాగే మ్యూజియం ప్రాంగణంలోని బోటింగ్ పాయింట్, సెల్ఫీ పాయింట్, పాతకాలపు ఇండ్లు, పిల్లల కోసం ఏర్పాటు చేసిన క్రీడాస్థలం విద్యార్థులను ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయని చెప్పారు.
ఈ కార్యక్రమంలో లెక్చరర్లు సంధ్యారాణి, ప్రసన్న, పావని, రమాదేవి, వీణ, ఉపాధ్యాయినీలు వరలక్ష్మి, రేవతి, మోహిని, ఊర్మిళ, స్వప్న ప్రియ, నాగమణి, మ్యూజియం నిర్వాహకులు వీరాస్వామి, మాధవి, చలపతిరావు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.