గుండాల మండలం నవంబర్ 19 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి
గుండాల మండల పరిధిలో రోడ్లపై మొక్కజొన్నతో పాటు ఇతర ధాన్యాలను ఆరబెట్టడం వల్ల రహదారులు జారుడుగ మారి, వాహనాలు స్కిడ్ అవుతున్న ఘటనలు పెరుగుతున్నాయని సి.ఐ. లోడిగ రవీందర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఉదయం వేళలలో మంచు తీవ్రంగా కనిపించడం, రోడ్డు స్పష్టత తగ్గిపోవడం, రహదారులపై ధాన్యాలు ఆరబెట్టడం వాహనదారులకు ప్రమాదకర పరిస్థితులను సృష్టిస్తున్నాయని ఆయన తెలిపారు.
మండలంలోని కొన్ని గ్రామాల్లో రహదారులపై పంట అవశేషాలు, మొక్కజొన్న గింజలు ఆరబెట్టడం వల్ల పలువురు వాహనదారులు నియంత్రణ కోల్పోయిన సంఘటనలు పోలీసుల దృష్టికి వచ్చినట్లు సి.ఐ. తెలిపారు. ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా ఇలాంటి చర్యలను తక్షణమే ఆపాలని రైతులను కోరారు. రోడ్లపై ధాన్యాలను ఆరబెట్టడం చట్టపరమైన నేరమని, దీనిపై పర్యవేక్షణను మరింత బలపరుస్తామని తెలిపారు.
రైతులకు సూచనలు:
రహదారులపై మొక్కజొన్న, ధాన్యాలు, పంట అవశేషాలను ఆరబెట్టరాదు.
పంటను ఆరబెట్టడానికి మీ పొలాలు, గుమ్మాలు లేదా గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్థలాలను మాత్రమే ఉపయోగించాలి.
రోడ్డుపై ధాన్యం గాలికి ఎగిరిపోకుండా కర్రలు, రాళ్లు పెట్టడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇవి పూర్తిగా నిషేధిత చర్యలని సి.ఐ. హెచ్చరించారు.
వాహనదారులకు సూచనలు:
ఉదయం మంచు ఎక్కువగా ఉన్నప్పుడు తప్పనిసరిగా వాహనం వేగం తగ్గించాలి.
హెడ్‌లైట్లు లో బీమ్‌లో ఉంచి, ఇండికేటర్లు ఆన్ చేసి ప్రయాణించాలి.
ముందున్న వాహనానికి తగిన దూరం పాటించాలి.
రహదారిపై తడి, ధాన్యం, పంట అవశేషాలు కనిపించిన వెంటనే వేగం తగ్గించి జాగ్రత్తగా ముందుకు సాగాలి.
అత్యవసరమైతే తప్ప ఉదయం సమయంలో ప్రయాణాలు మానుకోవాలని సూచించారు.
ప్రజల భద్రతే తమ ప్రథమ కర్తవ్యం అని, ప్రతి ప్రాణం విలువైనదని, అందరూ రోడ్డు నియమాలను కచ్చితంగా పాటించాలని సి.ఐ. లోడిగ రవీందర్ విజ్ఞప్తి చేశారు. రోడ్లను స్వచ్ఛంగా ఉంచడం ప్రతి పౌరుడి బాధ్యత అని, చిన్న నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందన్న సంగతి మరవొద్దని పోలీసులు పేర్కొన్నారు.
