ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్ యూ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 23వ మహాసభ సందర్భంగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి అంబేద్కర్ సెంటర్ వరకు మహాసభల జయప్రదానికై భారీ ప్రదర్శన నిర్వహించారు. తొలుత పిడిఎస్ యూ సీనియర్ నాయకులు బానోత్ నరేందర్ బిగిపిడికిలి జెండాను ఆవిష్కరించారు. దేశంలో అసమానతలు లేని విద్యావిధానం కోసం విద్యార్థులు పోరాడాలనీ, మణుగూరులో బత్తుల వెంకటేశ్వరరావు నగర్ లో జరుగుతున్న పిడిఎస్ యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 23వ మహాసభల్లో ప్రారంభ సభలో మాట్లాడిన ఇల్లందు మాజీ శాసనసభ్యులు గుమ్మడి నరసయ్య విద్యార్థులకు పిలుపునిచ్చారు.
పాలక ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి విద్యారంగంలో నూతన విద్యా విధానం పేరుతో మతతత్వ భావాల్ని చాప కింద నీరులా వ్యాప్తి చేస్తోందని అన్నారు. విద్యార్థుల పాఠ్యపుస్తకాల్లో భగత్ సింగ్, అంబేద్కర్, గాంధీజీ వంటి జాతీయ నాయకుల చరిత్రలను, శాస్త్రీయతను పెంపొందించే అంశాలు డార్విన్ జీవ పరిణామ క్రమ సిద్ధాంతం తొలగిస్తున్నారనీ అన్నారు. మొఘలుల చరిత్రను పాఠ్యాంశాల్లోంచి తొలగించి చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తుందన్నారు. ఈ దేశ జాతీయ ఉద్యమానికి సంబంధంలేని సావర్కర్ హెగ్డే వార్ ల చరిత్రలను పాఠ్యపుస్తకాలలో పొందుపరుస్తున్నారని అన్నారు. బిజెపి, ఆర్ఎస్ఎస్ ఈ దేశానికి ప్రమాదకరమని, వారి భావాజాలం మొత్తం దేశానికే అత్యంత ప్రమాదకరమైనదనీ అన్నారు. సంపన్న వర్గాలకు, అట్టడుగు వర్గాలకు ఒకే రకమైన విద్య అందాలని, ప్రభుత్వ విద్యాసంస్థల ద్వారా అది సాధ్యపడుతుందని, ప్రైవేటు విద్యాసంస్థలతో అంతరాలు మరింత పెరిగిపోతాయని ఆయన అన్నారు. పిడిఎస్ యూ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృధ్వీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వాల్సిన 9000 కోట్ల రూపాయల స్కాలర్షిప్ మరియు ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయనీ, సంక్షేమ వసతి గృహాల్లో చదివే విద్యార్థులకు ఇవ్వాల్సిన కాస్మోటిక్ చార్జీలు, డైట్ బిల్లులు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. మహాసభ పలు అంశాలపై తీర్మానాలు చేసినట్లు తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని,
రాష్ట్రంలో విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహించాలని, పెండింగ్ స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, మెస్ కాస్మోటిక్ ఛార్జీలు విడుదల చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ అధ్యాపక,నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో, జూనియర్ డిగ్రీ కళాశాలల్లో, యూనివర్సిటీలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, తగు బడ్జెట్ కేటాయించాలని కోరారు.
ప్రారంభ సభలో అరుణోదయ కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి, సభలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి ముద్దా బిక్షం, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జాటోత్ కృష్ణ, మధుసూదన్ రెడ్డి, భాస్కర్ , పూర్వ విద్యార్ధి నాయకురాలు సంద్య, పిడిఎస్ యూ జిల్లా మునిగెల శివ ప్రశాంత్, వీరభద్రం ,భానోత్ నరేందర్, సాయి,తరుణ్,స్పందన, జార్జి, రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు.
