ఈ బయ్యారం వర్తక సంఘం అధ్యక్షుడిగా సురేష్‌కు ఏడాది పూర్తి

ఈ బయ్యారం వర్తక సంఘం అధ్యక్షుడిగా సురేష్‌కు ఏడాది పూర్తి
వర్తక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు
ప్రతి ఒక్కరి సహకారంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అధ్యక్షుడు సురేష్ వ్యాఖ్య
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ బయ్యారం క్రాస్‌రోడ్‌లో వర్తక సంఘం అధ్యక్షుడిగా సురేష్ బాధ్యతలు చేపట్టి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా వర్తక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వర్తక సంఘ సభ్యులు, వ్యాపారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై అధ్యక్షుడు సురేష్‌ను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా వర్తక సంఘం కార్యాలయంలో  నిర్వహించిన సమావేశంలో అధ్యక్షుడు సురేష్ మాట్లాడుతూ గత ఏడాది కాలంలో వర్తక సంఘం అభివృద్ధికి సభ్యులంతా అందించిన సహకారం మరువలేనిదన్నారు. వ్యాపారుల సమస్యల పరిష్కారం, ప్రభుత్వ అధికారులతో సమన్వయం, వ్యాపారుల హక్కుల పరిరక్షణ, సామాజిక సేవా కార్యక్రమాల్లో వర్తక సంఘం చురుకుగా పాల్గొనడం వంటి అంశాల్లో అందరి సహకారంతో ముందుకు సాగగలిగామని తెలిపారు.వ్యాపారుల ఐక్యతే సంఘానికి బలమన్నారు.భవిష్యత్తులో కూడా సంఘాన్ని మరింత బలోపేతం చేసి వ్యాపారుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి వ్యాపారి సమస్యను సంఘం సమస్యగానే భావించి పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు.అనంతరం పలువురు వర్తక సంఘ సభ్యులు మాట్లాడుతూ, అధ్యక్షుడు సురేష్ నాయకత్వంలో సంఘం మరింత చురుకుగా పనిచేస్తోందని కొనియాడారు. వ్యాపారుల మధ్య ఐక్యత పెంపొందించడం, అవసరమైన సందర్భాల్లో వారికి అండగా నిలవడం వంటి కార్యక్రమాల్లో ఆయన సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.
ఈ వేడుకల్లో సంఘ సభ్యులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం సభ్యులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా ఇదే ఐక్యతతో సంఘం అభివృద్ధికి కృషి చేయాలని సంకల్పించారు. కార్యక్రమం అనంతరం పాల్గొన్న వారికి అల్పాహార విందు ఏర్పాటు చేశారు. స్థానిక వ్యాపారులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు