ఆదోని, జూన్ 28:
ఆదోని పట్టణంలోని ఆర్.ఆర్. లేబర్ కాలనీ ముఖద్వారం వద్ద ఉన్న ఆవు దూడ వంకపై నూతన వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం 7వ రోజుకు చేరుకున్నాయి.
ఈ సందర్భంగా దీక్షా శిబిరాన్ని సీపీఎం నాయకులు సందర్శించి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ప్రజల ప్రాణాల రక్షణ కోసం సీపీఐ చేపట్టిన ఉద్యమానికి పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.
సీపీఐ పట్టణ కార్యదర్శి టి. వీరేష్ మాట్లాడుతూ, ఆవు దూడ వంకపై ప్రతిరోజూ వేలాది మంది ప్రజలు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ శాశ్వత వంతెన నిర్మాణంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విమర్శించారు. ప్రమాదాలు జరగక ముందే వెంటనే నూతన బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేశారు.
సమస్యను పరిష్కరించకపోతే జరిగే ప్రమాదాలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అలాగే సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించి ప్రజలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు కే. అనుమప్ప, కే. రమేష్ కుమార్, సీపీఎం పట్టణ కార్యదర్శి డి. లక్ష్మన్న, పి.ఎస్. గోపాల్, సీఐటీయూ నాయకులు తిప్పన్నతో పాటు కాలనీ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు