మొహరం వేడుకలు ప్రశాంతంగా నిర్వహించాలి

మొహరం వేడుకలు ప్రశాంతంగా నిర్వహించాలి
-నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
-ఆదోని టూ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి హెచ్చరిక
ఆదోని, జూన్ 20 (స్వతంత్ర భారత్): ఆదోని పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలోని 17వ కల్లుబావి ప్రాంతంలో మొహరం పండుగ నిర్వహణకు సంబంధించి ఆదోని టూ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి గ్రామ పెద్దలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. మొహరం వేడుకలను శాంతియుత వాతావరణంలో, పరస్పర సహకారంతో నిర్వహించాలని సూచించారు.

ఈ సందర్భంగా సీఐ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మొహరం పండుగలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొంటారని, ఎలాంటి ఘర్షణలు, వివాదాలకు తావు ఇవ్వకుండా వేడుకలను నిర్వహించాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

గ్రామ పెద్దలు మొహరం వేడుకల నిర్వహణకు అనుమతి కోరగా, నిబంధనలను పాటిస్తూ పండుగను ఘనంగా నిర్వహిస్తే వచ్చే ఏడాది పూర్తి స్థాయిలో అనుమతులు మంజూరు చేసేందుకు సహకరిస్తామని సీఐ హామీ ఇచ్చారు.

మొహరం వేడుకలను విజయవంతం చేసేందుకు గ్రామ పెద్దలు పోలీసు శాఖకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాధవరెడ్డి, డీకే జగదీష్, డీకే మల్లికార్జున, రాఘవరెడ్డి, వాల్మీకి శ్రీను, కల్లుబావి ఎస్సీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

– స్వామిదాసు, స్వతంత్ర భారత్ ప్రతినిధి, ఆదోని

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు