వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సంఘటిత పోరాటాలే మార్గం - రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య


వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సంఘటిత పోరాటాలే మార్గం అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య అన్నారు.
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాల్గవ మహాసభలు పినపాక మండలం ఈ బయ్యారం గ్రామంలో సోమవారం ఘనంగా నిర్వహించబడ్డాయి. గ్రామంలోని స్థానిక వేదికలో జరిగిన ఈ మహాసభలకు సంఘం రాష్ట్ర నాయకులు అన్నవరపు కనకయ్య, జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మల వెంకన్న ముఖ్య అతిథులుగా హాజరై కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సంఘటిత పోరాటాలే మార్గమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం, పెరుగుతున్న ధరలు, కూలీలకు సరైన వేతనాలు అందకపోవడం వంటి సమస్యలపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. వ్యవసాయ కార్మికుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.ఉపాధి హామీ పథకంలో పని దినాలను పెంచడంతో పాటు కూలీలకు చెల్లించే వేతనాలను పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని, కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు.మహాసభలో సంఘం భవిష్యత్ కార్యాచరణ, సభ్యత్వ విస్తరణ, కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమ కార్యక్రమాలపై పలు తీర్మానాలు ఆమోదించారు. గ్రామీణ ప్రాంతాల్లో కార్మికుల ఐక్యతను పెంపొందించి వారి సమస్యల పరిష్కారానికి ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి దుబ్బ గోవర్ధన్, మండల కమిటీ సభ్యులు మడివి రమేష్, దడిగల వెంకన్న, కల్తి వెంకటేశ్వర్లు, మండల నాయకులు, గ్రామ శాఖ ప్రతినిధులు, వ్యవసాయ కార్మికులు, మహిళా కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు