ఆదోని: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర డిమాండ్ చేశారు. ఆదివారం ఆదోని మండల కమిటీ సమావేశం మండల నాయకుడు శ్రీకృష్ణ అధ్యక్షతన స్థానిక సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించబడింది.
ఈ సందర్భంగా రాఘవేంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయ్యాయని, ఈ సందర్భంగా ప్రభుత్వం తన విజయాలను విస్తృతంగా ప్రచారం చేసుకుంటోందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు, కార్యకర్తలకు సూచనలు చేస్తున్నారని పేర్కొన్నారు.
అయితే ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీల గురించి ప్రభుత్వం మాట్లాడటం లేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా ఆశించిన స్థాయిలో చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయని ప్రచారం చేస్తున్నప్పటికీ, యువతకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే నిరుద్యోగ భృతిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో మండల కార్యదర్శి వీరేష్, మండల నాయకులు చిరంజీవి, ఉసేని, గర్జప్ప, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు