పినపాక: మణుగూరు మండలం రామానుజవరం ఇసుక క్వారీ నిర్వాహకులపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పినపాక మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఏడూళ్లబయ్యారం క్రాస్‌రోడ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.రామానుజవరం ఇసుక క్వారీకి చెందిన వందలాది లారీలు సోమవారం సాంబాయిగూడెం వద్ద మణుగూరు–ఏటూరునాగారం ప్రధాన రహదారిపై నిలిచిపోవడంతో సుమారు రెండు గంటల పాటు భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని తెలిపారు. దీంతో ప్రయాణికులు, అత్యవసర సేవలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయని అన్నారు.
ట్రాఫిక్ జామ్ కారణంగా పినపాక మండలం పోట్లపల్లి పంచాయతీ గడ్డిగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని ఆరోపించారు. ఆత్మహత్యాయత్నం చేసిన అతడిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో సమయానికి వైద్యం అందక మృతి చెందినట్లు పేర్కొన్నారు.అలాగే ఇటీవల జరిగిన నీట్ పరీక్షకు హాజరుకావాల్సిన ఓ విద్యార్థిని కూడా ఇసుక లారీల వల్ల ఏర్పడిన ట్రాఫిక్ కారణంగా పరీక్ష కేంద్రానికి సమయానికి చేరుకోలేకపోయిందని అన్నారు.ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు, రవాణా శాఖలు ప్రధాన రహదారులపై ఇసుక లారీలు నిలిపివేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో బీ ఆర్ ఎస్ నాయకులు గుమ్మడి గాంధీ, దాట్ల వాసుబాబు, పొనుగోటి భద్రయ్య, రవివర్మ, పోలిశెట్టి సత్తిబాబు, బత్తుల వెంకటరెడ్డి, చెన్నకేశవులు, షేక్ జాంగీర్, బూర రమేష్, పడిగె అశోక్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
#Pinapaka #Manuguru #RamanujavaramSandQuarry #BRS #PagadalaSatishReddy #TrafficJam #SandLorries #SBNEWS #BhadradriKothagudem #TelanganaNews
0 కామెంట్‌లు