డీఎంహెచ్‌వోకు వనజ కుటుంబ సభ్యుల ఫిర్యాదు
గుండాల మండలం, జూన్ 17 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి:
గుండాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె చాట్ల వనజతో పాటు పుట్టిన ఆడ శిశువు మరణించారని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి (డీఎంహెచ్‌వో) ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
వనజ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 13వ తేదీన ఉదయం 11 గంటల సమయంలో ప్రసవ నొప్పులతో బాధపడుతున్న చాట్ల వనజను గుండాల పీహెచ్‌సీకి తీసుకువెళ్లారు. అయితే ఆ సమయంలో ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో అక్కడ పనిచేస్తున్న ఓ నర్సు ప్రసవం నిర్వహించినట్లు తెలిపారు. ప్రసవంలో ఆడ శిశువు జన్మించినప్పటికీ, పుట్టిన వెంటనే శిశువు ఏడవలేదని పేర్కొన్నారు. అనంతరం శిశువుకు ఆక్సిజన్ అందించినప్పటికీ ఫలితం లేకపోయిందని, తరువాత పరీక్షించిన వైద్యుడు శిశువు మరణించినట్లు నిర్ధారించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇదిలా ఉండగా, ప్రసవం అనంతరం వనజకు తీవ్ర రక్తస్రావం జరగడంతో ఆమె పరిస్థితి విషమించిందన్నారు. వెంటనే ఆమెను ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్‌లో తరలించే క్రమంలో ఆమె మృతి చెందినట్లు వివరించారు.
పీహెచ్‌సీ సిబ్బంది నిర్లక్ష్యం, వైద్య సేవల లోపం కారణంగానే ఈ విషాదం చోటుచేసుకుందని ఆరోపించిన వనజ తల్లిదండ్రులు కుంజ సత్యం, లక్ష్మి, బాబాయి కుంజ రాంబాబు, శంబునిగూడెం సర్పంచ్ ఈసం సుమలత, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈసం రాజబాబు మంగళవారం డీఎంహెచ్‌వో తుకారం రాథోడ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుని తమ కుటుంబానికి న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
0 కామెంట్‌లు