30 అడుగుల రోడ్డుకు మోక్షం ఎప్పుడు?

30 అడుగుల రోడ్డుకు మోక్షం ఎప్పుడు?

సారపాకలో ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణానికి బీజేపీ డిమాండ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామపంచాయతీ పరిధిలోని 30 అడుగుల పూర్వ డొంక రహదారిని బీజేపీ నాయకులు పరిశీలించి, వెంటనే రహదారి నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులను కోరారు.

సారపాక పారిశ్రామిక ప్రాంతం కావడంతో జాతీయ రహదారిపై నిత్యం భారీ ట్రాఫిక్ ఉండటంతో పాటు తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని నాయకులు పేర్కొన్నారు. ప్రమాదాల నివారణకు ప్రత్యామ్నాయ మార్గంగా రామభద్ర ఐటీఐ కళాశాల నుంచి గాంధీనగర్‌కు వెళ్లే పాత మట్టి రోడ్డును అభివృద్ధి చేసి రహదారిగా మార్చాలని డిమాండ్ చేశారు.

ఈ రహదారి నిర్మాణం చేపడితే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, కార్మికులు, రైతులు, విద్యార్థులకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడుతుందని తెలిపారు. ముఖ్యంగా ఈ నెల 15 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానుండటంతో భాస్కర్‌నగర్, గాంధీనగర్ ప్రాంతాల విద్యార్థులకు ఈ మార్గం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు.

అదేవిధంగా గాంధీనగర్ అమ్మవారి గుడి వీధిలో అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ చేరుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, రహదారి నిర్మాణం పూర్తయితే వాహన రాకపోకలు సులభతరం అవుతాయని పేర్కొన్నారు.

కాబట్టి సంబంధిత అధికారులు, సారపాక గ్రామపంచాయతీ పాలకవర్గం వెంటనే స్పందించి రహదారి నిర్మాణానికి చర్యలు చేపట్టి ప్రజల సమస్యలను పరిష్కరించాలని బీజేపీ నాయకులు కోరారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మహబూబాబాద్ పార్లమెంట్ కన్వీనర్, మండల ఇంచార్జ్ ముస్కు శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గుగులోత్ బాలు నాయక్, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి భూక్య సీతారాం నాయక్, జిల్లా ఉపాధ్యక్షురాలు భూక్య దివ్యశ్రీ, మండల అధ్యక్షుడు బీరక సాయిశ్రీను తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు