జెకె-5 ఓసీ నిర్వాసితులకు న్యాయం చేయాలి: ఐటీడీఏ అధికారిని కలిసిన సర్పంచులు, అఖిలపక్ష నేతలు

జెకె-5 ఓసీ నిర్వాసితులకు న్యాయం చేయాలి: ఐటీడీఏ అధికారిని కలిసిన సర్పంచులు, అఖిలపక్ష నేతలు
స్వతంత్ర భారత్ – భద్రాచలం | ఏప్రిల్ 20
జెకె-5 ఓసీ ప్రాజెక్ట్ కొనసాగింపులో భాగంగా నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విజయలక్ష్మి నగర్, తిలక్ నగర్ గ్రామాల సర్పంచులు మరియు అఖిలపక్ష కమిటీ సభ్యులు భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్‌లో అధికారులను కలిశారు.

సర్పంచులు చాందవ రమేష్ బాబు, ధనసరి స్రవంతి ఆధ్వర్యంలో 21 మంది అఖిలపక్ష కమిటీ నాయకులు APOను కలిసి తమ సమస్యలను వివరించారు.

వారు మాట్లాడుతూ, తమ పూర్వీకులు సింగరేణి సంస్థకు సేవలందించి రిటైర్డ్ అయ్యాక ఇక్కడే స్థిరపడ్డారని తెలిపారు. ప్రస్తుతం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, నష్టపరిహారం లేకుండా వెంటనే ఇళ్లను ఖాళీ చేయాలని సింగరేణి యాజమాన్యం ఒత్తిడి తెస్తోందని ఆరోపించారు. ఈ పరిస్థితిపై తక్షణమే స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.

దాదాపు 130 సంవత్సరాలుగా ఈ ప్రాంతాల్లో నివసిస్తున్నామని, ఇక్కడి ప్రజలు ఎక్కువగా మాజీ కార్మికుల కుటుంబ సభ్యులేనని తెలిపారు. గత 20–30 సంవత్సరాలుగా అభివృద్ధి పనులు చేపట్టకుండా నిర్లక్ష్యం చేసిన సింగరేణి, ఇప్పుడు ప్రాజెక్టు పేరుతో దౌర్జన్యంగా ఖాళీ చేయాలని చూస్తోందని విమర్శించారు.

జెకె-5 ఓసీ కొనసాగింపులో భాగంగా 21 ఫిట్ ఏరియాలో ఉన్న విజయలక్ష్మి నగర్, తిలక్ నగర్ ప్రాంతాలను ఎలాంటి సమాచారం లేకుండా ఖాళీ చేయమని అధికారులు ఇంటింటికీ వెళ్లి చెబుతున్నారని పేర్కొన్నారు. చట్టప్రకారం రావాల్సిన పరిహారం అందించిన తర్వాతనే ఇళ్లు ఖాళీ చేస్తామని స్పష్టం చేశారు.

ఇంతకు ముందు అఖిలపక్ష కమిటీతో చర్చల్లో కొన్ని డిమాండ్లను అంగీకరించిన సింగరేణి యాజమాన్యం, ఇప్పుడు ఆ మాటలను విస్మరించి వెంటనే ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేస్తోందని తెలిపారు.


---

ప్రధాన డిమాండ్లు:

జెకె-5 ఓసీలో ఇప్పటికే అమలు చేసిన విధంగా ఆర్ & ఆర్ ప్యాకేజీ ఇవ్వాలి

ప్రతి కుటుంబానికి, కుటుంబంలోని ప్రతి సభ్యుడికి న్యాయం చేయాలి

ఆర్ & ఆర్ కాలనీలో ఉన్న అన్ని సదుపాయాలు కల్పించాలి

కొత్త ఇళ్లు నిర్మించే వరకు తాత్కాలిక నివాస సౌకర్యం కల్పించాలి

రెండు గ్రామపంచాయతీలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలి

సొంత ఇళ్లు నిర్మించుకున్న వారికి పట్టాలు ఇవ్వాలి

సింగరేణి క్వార్టర్స్‌లో నివసిస్తున్న వారికి వాటిని అప్పగించాలి

ప్రభుత్వ విద్యుత్ సరఫరా కల్పించాలి



---

ఈ అంశంపై పూర్తి వివరాలతో రావాలని సింగరేణి అధికారులకు లేఖ పంపిస్తామని జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పూనెం సురేందర్, ఎట్టి హరికృష్ణ, మంచాల వెంకటేశ్వర్లు, గుడిపెలి భాస్కర్, వడ్రల శ్రీను, తేజవత్ లాలు, ధనసరి రాజు, బానోత్ హరిసింగ్ తదితరులు పాల్గొన్నారు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు