సింగరేణి రక్షణకై ఏప్రిల్ 28న చలో హైదరాబాద్ విజయవంతం చేయాలి: సిఐటియు పిలుపు
మణుగూరు, ఏప్రిల్ 16:
సింగరేణి సంస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని, కార్మికుల వేతనాల కోసం నెలకు రూ.350 కోట్లకు పైగా అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నదని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు మంద నరసింహారావు, రాష్ట్ర కార్యదర్శి తుమ్మల రాజిరెడ్డి తెలిపారు.
తెలంగాణ విద్యుత్ సంస్థల నుండి రావాల్సిన రూ.51 వేల కోట్ల బకాయిలు రాకపోవడంతో సింగరేణి అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, సంస్థ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని వారు పేర్కొన్నారు. ఈ పరిస్థితి మారకముందే కార్మిక వర్గం ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈనెల 28న చలో హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా విద్యుత్ సౌధ, సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సింగరేణి కార్మికులతోనే ఓపెన్‌కాస్ట్ పనులు చేపట్టాలని, నైని బ్లాకులను ప్రైవేటుకు ఇవ్వకుండా సంస్థకే కేటాయించాలని డిమాండ్ చేశారు.
సింగరేణిలో రాజకీయ జోక్యాన్ని తగ్గించాలని, కారుణ్య నియామకాలను వెంటనే అమలు చేయాలని, కార్మికుల సొంత ఇంటి పథకాన్ని అమలు చేయాలని కోరారు. అలాగే సంస్థలో జరుగుతున్న కుంభకోణాలను అరికట్టాలని అన్నారు.
మణుగూరు ఓసీ-2 సింగరేణికి రాకపోతే ప్రాంత భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సమావేశాల్లో పీకే ఓసీ-2, కేపీయూజీ, ఏరియా వర్క్‌షాప్, ఏరియా హాస్పిటల్, సివిల్ విభాగం, జీఎం కార్యాలయాల్లో పాల్గొని కార్మికులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నెల్లూరి నాగేశ్వరరావు, వల్లూరు వెంకటరత్నం, మాచారపు లక్ష్మణరావు, సాయి కృష్ణ, ఎండి ముజఫర్, నల్లెల విల్సన్ రాజు, ముత్యాల సుమన్, సత్రపల్లి సాంబశివరావు, కొడిశాల రాములు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
#Singareni #CITU #ChaloHyderabad #CoalWorkers #TelanganaNews #WorkersRights #Manuguru #LabourUnion
0 కామెంట్‌లు