పినపాక మండలం జానంపేట గ్రామంలో రైతులకు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం కొనసాగించేలా ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ సహాయ అధికారి తాతారావు ముఖ్య అతిథిగా హాజరై సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యతను వివరించారు. రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగం తగ్గించడం ద్వారా భూమి సారాన్ని కాపాడుకోవచ్చని, సేంద్రియ పద్ధతులు రైతులకు దీర్ఘకాలంలో లాభదాయకమని తెలిపారు.
సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించే పంటలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో పాటు, ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుందని ఆయన వివరించారు. రైతులు సహజ వనరులను వినియోగిస్తూ తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయని సూచించారు.
ఈ సందర్భంగా ఇప్పటికే సేంద్రియ వ్యవసాయం చేపడుతున్న రైతులను అభినందిస్తూ శాలువాలతో సన్మానించారు. వారి అనుభవాలను ఇతర రైతులతో పంచుకునేలా ప్రోత్సహించారు.గ్రామంలోని మరిన్ని రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లాలని అధికారులు కోరారు.కార్యక్రమంలో వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు, ఏఈవోలు, స్థానిక సర్పంచ్ ఉమా మహేశ్వరి, మల్లారం సర్పంచ్ ఇర్ఫా సాంబశివరావు, అమరారం సర్పంచ్ ప్రసాద్,స్థానిక రైతులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు