అశ్వాపురం మండలంలోని బుడుగు బజార్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పనుల పురోగతిని తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఓరుగంటి బిక్షమయ్య మాట్లాడుతూ, నిరుపేదల సొంతింటి కల ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమవుతుందని, కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాలకు మహర్దశ వస్తుందని తెలిపారు.
రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చేతుల మీదగా నియోజకవర్గంలో మొత్తం 4,500 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు అందజేయగా, అశ్వాపురం మండలంలో మొదటి విడతలో 817 మందికి కేటాయించారని తెలిపారు.
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు పలు గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించినట్లు చెప్పారు. లబ్ధిదారులు త్వరగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్ధమవ్వాలని సూచించారు.
రెండవ విడతలో ఏప్రిల్ నెలలో మరిన్ని ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాదె కేశవరెడ్డి, ఓరుగంటి రమేష్ బాబు, గొల్లపల్లి నరేష్ కుమార్, వేముల విజయ్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు