చదువుకుందాం రా… చదివిద్దాం పద

చదువుకుందాం రా… చదివిద్దాం పద

ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి గురించి మనం తరచుగా మాట్లాడుతుంటాం. రోడ్లు కావాలి, ఆసుపత్రులు కావాలి, సౌకర్యాలు కావాలి అని కోరుతుంటాం. కానీ ఈ అభివృద్ధికి అసలు బలం ఇచ్చేది ఒకటే – చదువు. చదువు ఉన్నప్పుడే వ్యక్తి జీవితం మారుతుంది, కుటుంబం ఎదుగుతుంది, గ్రామం అభివృద్ధి చెందుతుంది.ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా ప్రతిభావంతమైన పిల్లలు ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు వారిలో చాలామంది పదవ తరగతి కూడా పూర్తిచేయకుండా మధ్యలోనే చదువు మానేస్తున్నారు. కొందరు కుటుంబ పరిస్థితులు కారణంగా, కొందరు ఆసక్తి లేక, మరికొందరు సరైన మార్గదర్శకత్వం లేక చదువును వదిలేస్తున్నారు.

చదువు మానేస్తున్న పౌరులు… చీకటిలోకి వెళ్తున్న భవిష్యత్తు

ఇలా చిన్న వయసులోనే చదువు మానేయడం వల్ల భవిష్యత్తు అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి. చదువు లేకపోతే మంచి ఉద్యోగం దొరకడం కష్టం. సమాజంలో గౌరవంగా నిలబడే అవకాశం కూడా తగ్గిపోతుంది. చిన్నతనంలో తీసుకునే ఈ నిర్ణయం జీవితమంతా ప్రభావం చూపుతుంది.మరొక విచారకరమైన విషయం ఏమిటంటే, కొంతమంది ఇంటర్, డిగ్రీ, పీజీ వరకు చదివినా ఆ చదువును ఉపయోగపడే దిశగా తీసుకెళ్లడం లేదు. ఉద్యోగాల కోసం ప్రయత్నించకుండా, లక్ష్యాలు లేకుండా కాలాన్ని వృథా చేసుకుంటున్నారు. చదువు అనేది కేవలం సర్టిఫికెట్ కోసం కాదు; అది మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే మార్గం.

చదువు ఉన్నా లక్ష్యం లేకపోతే ప్రయోజనం ఏమిటి.?

ప్రతి విద్యార్థి ఒక లక్ష్యంతో చదవాలి. డాక్టర్ కావాలి, టీచర్ కావాలి, పోలీస్ కావాలి, అధికారి కావాలి, లేదా ఏదైనా నైపుణ్యం నేర్చుకుని మంచి జీవితం గడపాలి అనే ఆలోచన ఉండాలి. చదువు అంటే కేవలం పుస్తకాలు చదవడం కాదు, మన భవిష్యత్తును నిర్మించుకోవడం.తల్లిదండ్రులు కూడా పిల్లల చదువుపై ఎక్కువ శ్రద్ధ చూపాలి. చిన్న పనుల కోసం పిల్లలను చదువు మానేయకుండా ప్రోత్సహించాలి. గ్రామంలో ఉన్న పెద్దలు, ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు కలిసి పిల్లల్లో చదువుపై అవగాహన కల్పించాలి.ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మొదటగా పిల్లలు చదవాలి.చదువు ఉంటేనే ఉద్యోగాలు వస్తాయి, ఆర్థిక స్థితి మెరుగవుతుంది, సమాజంలో గౌరవం పెరుగుతుంది.

మలిపెద్ది పవన్ కళ్యాణ్ జర్నలిస్ట్ గుండాల 7093052815

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు