అమ్రాబాద్ అడవుల్లో చెంచు పెంటల్లోని చెంచుల ఆర్థిక పరిస్థితులపై రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆరా

అమ్రాబాద్ అడవుల్లో చెంచు పెంటల్లోని చెంచుల ఆర్థిక పరిస్థితులపై రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆరా
రాష్ట్ర గవర్నర్‌కు నల్లమల్ల టైగర్ పెద్దపులి ఛాయాచిత్రం జ్ఞాపికను గుర్తుగా అందజేసిన జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
నాగర్ కర్నూల్, మార్చ్ 14,(ఎస్ బి న్యూస్):
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజక వర్గం లోని నల్లమల అడవుల్లో జీవిస్తున్న చెంచు గిరిజనుల జీవన విధానం, ఆర్థిక స్థితిగతులపై రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అధికారులతో సమగ్రంగా చర్చించారు.
శనివారం కుటుంబ సమేతంగా శ్రీశైలం దేవస్థానంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణంలో భాగంగా ఆయన నాగర్‌కర్నూల్ జిల్లాఅచ్చంపేట నియోజక వర్గం లోని అమ్రాబాద్ మండలం మున్ననూరులోని తెలంగాణ టూరిజం మృగవాణి గెస్ట్ హౌస్‌లో కాసేపు విరామం తీసుకున్నారు.
ఈ సందర్భంగా నల్లమల్ల అడవుల్లోని వివిధ చెంచు పెంటల్లో జీవిస్తున్న గిరిజనుల జీవన విధానం, ఆర్థిక పరిస్థితులు, వారి సంస్కృతి గురించి స్థానిక అధికారులను గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. గవర్నర్ దత్తత తీసుకున్న చెంచు పెంటల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా సోలార్ విద్యుత్, త్రాగునీటి సదుపాయాలు, నిధుల వినియోగం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న సంక్షేమ పథకాల వివరాలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ,రాష్ట్ర గవర్నర్‌కు వివరించారు.
అదేవిధంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్న అపారమైన సహజ వనరులు, జలపాతాలు, వన్యమృగ సంపద, శైవ క్షేత్రాలు, చారిత్రక కట్టడాలు, ఎకో టూరిజం అభివృద్ధికి ఉన్న అవకాశాలపై కూడా అధికారులు గవర్నర్‌కు సమగ్ర సమాచారం అందించారు.
నల్లమల్ల అడవుల్లోని వన్యప్రాణులు, అడవుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు, జీవ వైవిధ్య పరిరక్షణ కార్యక్రమాలు, అటవీ ప్రాంతాల్లో ఎకో టూరిజం అభివృద్ధి ప్రణాళికలపై కూడా జిల్లా అటవీ శాఖ అధికారులు గవర్నర్‌కు వివరించారు.
అదే విధంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన ప్రగతి 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక వివరాలను జిల్లా కలెక్టర్ గవర్నర్‌కు తెలియజేశారు.
ఈ సందర్భంగా నల్లమల్ల అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అడవుల్లో సంచరిస్తున్న పెద్దపులి ఛాయాచిత్రాం రూపొందించిన ప్రత్యేక జ్ఞాపికను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా కు అందజేశారు.
నల్లమల్ల అరణ్య ప్రాంతంలోని సహజ సౌందర్యం, వన్యప్రాణి సంపదను ప్రతిబింబించేలా ఈ ఛాయాచిత్రం ఉండటంతో గవర్నర్ ప్రత్యేకంగా కలెక్టర్ ను అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్ చంద్ర, అచ్చంపేట ఆర్డీవో యాదగిరి, తహసీల్దార్ తదితర అధికారులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు