నాగర్‌కర్నూల్, మార్చి 24 (ఎస్‌బి న్యూస్): నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని ప్రసిద్ధ సలేశ్వరం జాతర నిర్వహణపై జిల్లా అధికారులు సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్ 1 నుంచి 3 వరకు జరిగే ఈ జాతరకు అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, అదనపు కలెక్టర్ జి.వి. శ్యాంప్రసాద్ లాల్, డీఎఫ్‌ఓ రేవంత్ చంద్రతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
జాతరకు భారీగా భక్తులు వచ్చే అవకాశమున్నందున ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమగ్ర ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. భక్తులకు ఏప్రిల్ 1 నుంచి 3 వరకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఫర్హాబాద్ మార్గం ద్వారానే ప్రవేశం కల్పిస్తామని స్పష్టం చేశారు.
భద్రతా చర్యల్లో భాగంగా అటవీ శాఖతో కలిసి పోలీస్ శాఖ కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయనుంది. రాత్రివేళల్లో భక్తులకు సౌకర్యంగా ఉండేందుకు సోలార్ లైట్లు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వాహనాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆర్టీసీ ద్వారా నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి, అచ్చంపేట డిపో నుండి అదనపు బస్సులు నడపనున్నారు. వైద్య శాఖ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేసి, అంబులెన్సులు 24 గంటలు సిద్ధంగా ఉంచాలని డీఎంహెచ్‌ఓకు ఆదేశించారు.
వేసవి దృష్ట్యా తాగునీటి సదుపాయాలు సమృద్ధిగా కల్పించాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే అన్నదాన కార్యక్రమాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు.
గర్భిణీ మహిళలు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారు జాతరకు రాకుండా ఉండటం మంచిదని కలెక్టర్ సూచించారు. జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ మాట్లాడుతూ జాతర సజావుగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తాయని తెలిపారు.
0 కామెంట్‌లు