నల్లమల్ల స్టడీ టూర్ భవిష్యత్ పాలనకు మార్గదర్శకం– ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ వైస్ చైర్‌పర్సన్ శాంతికుమారి

నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 05 (ఎస్‌బి న్యూస్):
గ్రూప్–1 అధికారులు క్షేత్రస్థాయి శిక్షణ తరగతులను ఆసక్తితో పాల్గొని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి శిక్షణ సంస్థ (MCRHRDI) వైస్ చైర్‌పర్సన్ శాంతికుమారి సూచించారు.
ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ ఆధ్వర్యంలో గ్రూప్–1 అధికారులకు నాగర్‌కర్నూల్ జిల్లాలో రెండు బ్యాచ్‌లుగా గత మూడు రోజులుగా నిర్వహించిన నల్లమల్ల అటవీ ప్రాంత ట్రెక్కింగ్, స్టడీ టూర్ శిక్షణ కార్యక్రమాల చివరి రోజు గురువారం ఆమె జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ నాయక్తో కలిసి పరిశీలించారు.
అచ్చంపేటలోని గిరిజన సంక్షేమ శాఖ శిక్షణ కేంద్రంలో శిక్షణ అధికారులు, గ్రూప్–1 అధికారులతో సమావేశమై అటవీ ప్రాంతంలో సందర్శించిన ప్రదేశాలు, అక్కడ పొందిన అనుభవాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా శాంతికుమారి మాట్లాడుతూ, క్షేత్రస్థాయి శిక్షణ ద్వారా పరిపాలనా వ్యవస్థను ప్రత్యక్షంగా అవగాహన చేసుకునే అవకాశం లభిస్తుందన్నారు. ప్రజల సమస్యలను దగ్గర నుంచి తెలుసుకుని సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ తరహా శిక్షణ భవిష్యత్ పాలనకు దిశానిర్దేశం చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పేద ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు.
నల్లమల్ల అటవీ ప్రాంతానికి విశేష ప్రాధాన్యం ఉందని, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌తో పాటు చెంచు గిరిజనుల జీవన విధానం అడవితో విడదీయరాని బంధంగా ముడిపడి ఉందని ఆమె తెలిపారు. చెంచు గిరిజనుల ఆచారాలు, సంప్రదాయాలను గౌరవిస్తూ వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేయాలని గ్రూప్–1 అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ నాయక్ మాట్లాడుతూ, గత మూడు రోజులుగా గ్రూప్–1 అధికారులకు నల్లమల్ల టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో నిర్వహించిన శిక్షణ, ట్రెక్కింగ్ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయ్యాయని తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను ప్రజలకు మెరుగైన పాలన అందించే విధంగా విధుల్లో అమలు చేయాలని సూచించారు.
గురువారం నల్లమల్ల అటవీ ప్రాంతంలోని సలేశ్వరం ట్రెక్కింగ్‌లో శిక్షణ అధికారులు, గ్రూప్–1 అధికారులతో కలిసి శాంతికుమారి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్ చంద్ర, అదనపు కలెక్టర్ అమరేందర్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఫిరంగితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

#Nallamala
#StudyTour
#Group1Officers
#MCRHRDI
#GoodGovernance
#FieldTraining
#NagarKurnool
#TelanganaAdministration
#SBNews

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు