కాచనపల్లి అటవీ రేంజ్‌లో టేకు చెట్ల దొంగతనాలు – రైతుల్లో ఆందోళన.

గతంలో టేకు కలపతో దొరికి మామ కన్ను డిఆర్ఓ సస్పెండ్.
అదే తరహాలో బీట్ ఆఫీసర్ హనుమంత సస్పెండ్

గుండాల మండలం, ఫిబ్రవరి 28 (స్వాతంత్ర్య భారత్ ప్రతినిధి):

గుండాల మండలం కాచనపల్లి అటవీశాఖ రేంజ్ పరిధిలో వరుసగా టేకు చెట్ల దొంగతనాలు చోటుచేసుకోవడం స్థానిక రైతుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రాయిగూడెం బీట్ పరిధిలోని రాయిగూడెం గ్రామానికి చెందిన గుగ్గల చిన్న నరసయ్య అనే రైతు వ్యవసాయ పట్టా కలిగిన భూమిలో 16 టేకు చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు యంత్రాలతో నరికి అపహరించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో కూడా ఇదే రేంజ్ పరిధిలో టేకు కలప అక్రమ రవాణా కేసులో అప్పటి ఫారెస్ట్ విఆర్‌ఓ బేగం టేకు ముక్కలతో సహా పట్టుబడి సస్పెండ్‌ అయిన విషయం తెలిసిందే. అలాగే అప్పటి బీట్ ఆఫీసర్ హనుమంతు కూడా వివిధ ఆరోపణల నేపథ్యంలో సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ పరిణామాల తరువాత పరిస్థితులు మెరుగుపడతాయని రైతులు భావించినప్పటికీ, తాజాగా మళ్లీ చెట్ల దొంగతనాలు జరగడం ప్రశ్నార్థకంగా మారింది.

ప్రస్తుతం కాచనపల్లి రేంజ్ డిఆర్ఓ సుక్కి పర్యవేక్షణలో బీట్ ఆఫీసర్లు కార్తీక్, ఉపేందర్, ఛాయా విధులు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ, ఇటీవల నెలల్లో పలు గ్రామాల్లో చెట్ల మాయం ఘటనలు చోటుచేసుకున్నాయి. జూన్ నెలలో ఒక రైతు పోడు భూమిలో ఆరు టేకు చెట్లు అదృశ్యమవగా, బాలాజీ అనే రైతు భూమిలో ఎనిమిది చెట్లు నరికివేయబడ్డాయి. అదేవిధంగా ఈసం అనితకు చెందిన పోడు పట్టా భూమిలో ఆరు చెట్లు మాయం కావడం గమనార్హం. ఇప్పుడు గోగ్గేల  చిన్న నరసయ్య చేనులో 16 టేకు చెట్లు నరికివేయబడటం రైతులను కలవరపెడుతోంది. ఈ విషయంపై డిఆర్ఓ సుక్కిని వివరణ కోరగా, “మేము విధులను సక్రమంగా నిర్వహిస్తున్నాం. చెట్ల అపహరణపై మాకు సంబంధం లేదు. సోమవారం రైతులను పిలిపించి విచారణ చేపడతాం” అని తెలిపారు.

బాధిత రైతులు ఇప్పటికే చట్టాన్ని ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఆళ్లపల్లి ఎస్సై సోమేశ్వరరావును సంప్రదించగా, టేకులపల్లి మండలం లచ్చుతాండ ప్రాంతానికి చెందిన ఒక అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందని తెలిపారు.

కాచనపల్లి రేంజ్‌లో వరుసగా జరుగుతున్న ఈ ఘటనలపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు