రేగా సైన్యం వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం


పినపాక మండలం పరిధిలోని పొట్లపల్లి గ్రామంలో రేగా సైన్యం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా వాలీబాల్ టోర్నమెంట్ బుధవారం ఘనంగా ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు టోర్నమెంట్‌ను ప్రారంభించి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలకు ప్రోత్సాహం ఇవ్వడం ఎంతో అవసరమని అన్నారు. యువత క్రీడల ద్వారా శారీరకంగా దృఢంగా, మానసికంగా బలంగా ఎదగాలని ఆకాంక్షించారు. క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొని గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
మూడు రోజులపాటు భద్రాద్రి–ములుగు జిల్లాల పరిధిలో నిర్వహిస్తున్న ఈ మెగా వాలీబాల్ టోర్నమెంట్ గ్రామీణ ప్రాంతాల్లో “మట్టిలో మాణిక్యాలను” వెలికితీసే వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి అన్ని విధాలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, అందుకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.
క్రీడా నిర్వాహకులు పక్షపాతం లేకుండా, నిష్పాక్షికంగా పోటీలు నిర్వహించాలని సూచించారు. క్రీడలు స్నేహభావాన్ని పెంపొందించడమే కాకుండా మానసిక ఉల్లాసం, దేహదారుఢ్యాన్ని పెంచుతాయని తెలిపారు. గ్రామీణ క్రీడలకు స్పాన్సర్లు చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు.
మారుమూల ప్రాంతమైన పొట్లపల్లిలో ఈ టోర్నమెంట్ నిర్వహించడం సంతోషకరమని పేర్కొంటూ, పోటీలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు పూణెం వెంకట నరసయ్య, ఎస్.కె. మదర్ సాహెబ్, గొంది నాగభూషణం, పవన్, బడే కృష్ణతో పాటు బీఆర్ఎస్ నాయకులు పోలిశెట్టి సత్తిబాబు, వాసుబాబు, గుమ్మడి గాంధీ, రవిశేఖర్ వర్మ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు