నిజాలను ప్రశ్నిస్తే అరెస్టులా?

బీజేపీ నాయకుల అక్రమ అరెస్టులను ఖండించిన నేతలు
నిజాలను ప్రశ్నిస్తే అరెస్టులా?
మంత్రి పర్యటన సందర్భంగా నిరసనకు వెళ్లిన వారిపై పోలీసుల చర్యలపై గండు శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం
నాగర్ కర్నూల్, ఫిబ్రవరి 12 (ఎస్‌బి న్యూస్): నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని నల్లమల ప్రాంతంలో మంత్రి వాకాటి శ్రీహరి పర్యటనను ప్రశ్నిస్తూ ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలియజేయడానికి వెళ్తున్న బీజేపీ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని బీజేపీ అచ్చంపేట పట్టణ అధ్యక్షుడు గండు శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా ఖండించారు.
అచ్చంపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, మక్తల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 6వ వార్డు గిరిజన అభ్యర్థి ఎరుకల మహాదేవప్ప అనుమానాస్పద మరణంపై న్యాయం కోరడం తప్పా? బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని అడగడం పాపమా? అని ప్రశ్నించారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను అరెస్టులతో అణచివేయడం ప్రజాస్వామ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బలహీనతకు నిదర్శనమని ఆయన అన్నారు. నిజం చెప్పమంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని నిలదీశారు. ప్రజల సమస్యలను లేవనెత్తిన వారిని అదుపులోకి తీసుకోవడం అధికార పార్టీకి అలవాటైందని విమర్శించారు.
బీజేపీ నాయకుల అక్రమ అరెస్టులతో ప్రజల ఆవేదనను ఆపలేరని హెచ్చరిస్తూ, ఒకరిని అరెస్టు చేస్తే వందల మంది న్యాయం కోరే వారు రోడ్డెక్కుతారని తెలిపారు. న్యాయం జరిగే వరకు, నిజం వెలుగులోకి వచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు తగిన తీర్పు ఇస్తారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మంగ్య నాయక్, బల్మూరి జానకి, ముక్తాల రేనయ్య, గోలి రేనయ్య, చందులాల్ చౌహాన్, శివచంద్ర, నరేష్, బయ్యరాజు, అంతటి వెంకటేష్, భరత్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు