పినపాక | SBNEWS:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని గోత్తి కోయ ఆదివాసీ గ్రామాలైన చింతలపాడు, పిట్టతోగు గ్రామాల్లో సేవా కార్యక్రమం నిర్వహించారు. గూంజ్ సంస్థ సహకారంతో ఆధార్ సంస్థ ఆధ్వర్యంలో 60 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి చలిదుప్పట్లు, బెడ్ షీట్లు, పిల్లలు మరియు పెద్దలకు అవసరమైన బట్టల కిట్లను పంపిణీ చేశారు.
మారుమూల ఆదివాసీ గ్రామాల్లో నివసిస్తున్న కుటుంబాలు చలికాలంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. అవసరమైన వారికి నేరుగా సహాయం అందించడమే లక్ష్యంగా ఈ సేవా కార్యక్రమం నిర్వహించామని పేర్కొన్నారు.
కిట్లు అందుకున్న గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులకు ఈ సహాయం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఆదివాసీ గ్రామాల్లో జీవన భద్రతను మెరుగుపరుస్తాయని గ్రామ పెద్దలు అభిప్రాయపడ్డారు.
భవిష్యత్తులో కూడా గూంజ్ సంస్థ సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి, ఆదివాసీ గ్రామాలకు అవసరమైన సహాయాన్ని అందిస్తామని ఆధార్ సంస్థ నిర్వాహకులు తెలిపారు. విద్య, ఆరోగ్యం, జీవనోపాధి రంగాల్లో కూడా సేవలు విస్తరించాలనే లక్ష్యంతో పనిచేస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఆధార్ సంస్థ నిర్వాహకులు తోలెం రమేష్, కిష్టాపురం సర్పంచ్ కారం పాపారావు, ఉప సర్పంచ్ మొగిలిపలి నాగరాజు, వార్డ్ మెంబర్స్ తోలెం నవీన్, వజ్జ రమేష్, గ్రామ పెద్దలు మడవి భద్రయ్య, మడకం నగేష్, చీమల రవితో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు