ఉమామహేశ్వరం ఆలయంలో భక్తుల పోటెత్తుదర్శనానికి గంట సమయం – ప్రత్యేక బస్సులు, క్యూలైన్ల ఏర్పాటు

నాగర్ కర్నూల్, ఫిబ్రవరి 15,(ఎస్ బి న్యూస్):
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజక వర్గం లోని శ్రీ ఉమామహేశ్వర దేవా లయంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీ భారీగా పెరిగింది. తెల్లవారుజాము నుంచే వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారి దర్శనానికి క్యూలో నిలబడ్డారు. దర్శనానికి కనీసం గంట సమయం పడుతుండటంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిశాయి.భక్తుల భద్రత దృష్ట్యా కొండపైకి ప్రైవేట్ వాహనాలను అనుమతించలేదు. ఆలయ యాజమాన్యం ఏర్పాటు చేసిన ప్రత్యేక టెంపుల్ బస్సుల ద్వారానే భక్తులను పైకి తరలిస్తున్నారు. బస్సులు అందుబాటులో లేని సమయంలో కొందరు భక్తులు నడక, ద్వారా మెట్ల మార్గాలను వినియోగించి ఆలయానికి చేరుకున్నారు.
ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. పోలీసులు, ఆలయ సిబ్బంది ట్రాఫిక్ నియంత్రణతో పాటు భక్తుల క్రమబద్ధీకరణలో నిమగ్నమయ్యారు. ధర్మదర్శనం కోసం వచ్చిన భక్తులు ఓర్పుగా క్యూలో నిలబడి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు.
భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అదనపు బస్సులు నడుపుతున్నారు. తాగునీరు, వైద్య సదుపాయాలను కూడా అందుబాటులో ఉంచారు. దర్శనం అనంతరం భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొంటూ మహాశివరాత్రిని ఘనంగా జరుపుకున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు