నాగర్ కర్నూల్, ఫిబ్రవరి 02,(ఎస్ బి న్యూస్):ప్రజలకు మెరుగైన పాలన అందించాలంటే ప్రభుత్వ అధికారులు తమ నైపుణ్యాలను నిరంతరం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరంఉందనినాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ నాయక్ అన్నారు. పాలనలో సామర్థ్యాన్ని పెంపొందించడంలో క్షేత్రస్థాయి పరిశీలన ఆధారిత శిక్షణ తరగతులు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని గిరిజన సంక్షేమ శాఖ శిక్షణ కేంద్రంలో హైదరాబాద్ మానవ వనరుల అభివృద్ధి శిక్షణ సంస్థ (ఎంహెచ్ఆర్డీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రోజుల క్షేత్రస్థాయి శిక్షణ కార్యక్రమాలను సోమ వారం రోజు జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ శిక్షణలో భాగంగా నల్లమల టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్, స్టడీ టూర్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నూతనంగా ఎంపికైన గ్రూప్–I అధికారుల కోసం ఈ శిక్షణ తరగతులను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజాపాలనలో అవసరమైన నైపుణ్యాలనుపెంపొందించడంతో పాటు ప్రభుత్వ విధానాల అమలుపై ప్రాయోగిక అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని చెప్పారు. శిక్షణను అధికారులు సద్వినియోగం చేసుకొని ప్రజలకుమరింతసమర్థవంతమైన సేవలు అందించాలని సూచించారు.
నల్లమల అటవీ ప్రాంతంలోని ఆధ్యాత్మిక దేవాలయాలు, ప్రకృతి సౌందర్య ప్రాంతాలు, వన్యప్రాణులు, వివిధ రకాల పక్షులు, జంతువులతో పాటు అక్కడ నివసిస్తున్న చెంచు గిరిజనుల జీవన విధానం, నైపుణ్యాలు, సామాజిక–ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేయాలని శిక్షణ పొందుతున్న అధికారులకు సూచించారు.
స్టడీ టూర్‌లో భాగంగా తొలి రోజు నల్లమల అటవీ ప్రాంతంలోని సలేశ్వరం, అక్కమహాదేవి ఆలయాలను సందర్శించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సందర్శన సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అందుబాటులో ఉంటారని, సమస్యలు ఎదురైతే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు.
నల్లమల అందాలను ప్రత్యక్షంగా వీక్షిస్తూ ప్రకృతి అనుభూతిని పొందాలని, దేశంలో ప్రత్యేక గుర్తింపు పొందిన అమ్రాబాద్ నల్లమల పెద్దపులులఅభయారణ్యంలోని దట్టమైన అడవులను సందర్శించి అధ్యయనం చేయాలని కలెక్టర్ కోరారు. జలపాతాలు, గుహలు, దట్టమైన వృక్షజాలం, సమృద్ధమైన జంతుజాలంతో నల్లమల అటవీ ప్రాంతం ప్రకృతి అందాలకు నిలయంగా ఉందని తెలిపారు.
చరిత్రను ప్రతిబింబించే శాసనాలు, వాగులు–వంకలు, కృష్ణా తీరం వెంబడి ఉన్న ఆధ్యాత్మిక క్షేత్రాలు, దట్టమైన అడవుల్లో వన్యప్రాణుల సందళ్లు నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట అటవీ ప్రాంతానికి ప్రత్యేకగుర్తింపునిస్తున్నాయని చెప్పారు. ఈ అధ్యయన పర్యటన ద్వారా అనేక అనుభూతులను పొందుతూ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్ చంద్ర, అదనపు కలెక్టర్ అమరేందర్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఫిరంగి, డా. డి. తిరువెంగళ చారి, కోర్స్ కోఆర్డినేటర్, కంబైన్డ్ ఫౌండేషన్ కోర్స్, గ్రూప్–I సర్వీస్ అధికారులు 2026 (బ్యాచ్–I) తదితరులు పాల్గొన్నారు.
