Subscribe Us

SB LATEST:

30, జనవరి 2026, శుక్రవారం

మినీ మేడారం జాతరలో ఎమ్మెల్యే అక్రమ అరెస్ట్‌పై స్పీకర్‌కు ప్రివిలైజ్ మోషన్


వీణవంక మండలంలో నిన్న నిర్వహించిన మినీ మేడారం సమ్మక్క–సారక్క జాతర సందర్భంగా, కరీంనగర్ జిల్లా సీపీ, ఏసీపీ, సీఐలు కలిసి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం అత్యంత బాధాకరమని ఆయన తీవ్రంగా ఖండించారు.

ప్రజలతో కలిసి ఆదివాసీ దేవతల పవిత్ర జాతరలో పాల్గొంటున్న సమయంలో, ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా, చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తూ తనను అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన శాసనసభ్యుడిపై అధికార పార్టీ ఒత్తిడితో పోలీస్ యంత్రాంగం దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు.
ఈ ఘటన శాసనసభ హక్కులను, ప్రజాప్రతినిధుల గౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీసే విధంగా ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో బాధ్యులైన అధికారులపై ప్రివిలైజ్ ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు శాసనసభలో గౌరవ స్పీకర్ గారికి ప్రివిలైజ్ మోషన్ సమర్పించామని ఎమ్మెల్యే వెల్లడించారు.

పవిత్రమైన సమ్మక్క–సారక్క జాతరను రాజకీయ ప్రయోజనాల కోసం భంగపెట్టడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. అధికార పార్టీ అండదండలతో కరీంనగర్ సీపీ, హుజురాబాద్ ఏసీపీ, జమ్మికుంట రూరల్ సీఐలు చట్టాన్ని ఉల్లంఘించి ఎమ్మెల్యే హక్కులను కాలరాస్తున్నారని తీవ్రంగా విమర్శించారు.

రాబోయే మూడేళ్లలో రాష్ట్రంలో తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని, అప్పుడు ఈ అధికారులకు చట్టప్రకారం గట్టి బుద్ధి చెబుతామని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు.

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై ఈరోజు విచారణ జరగగా, BRS పార్టీ పక్షాన తాను హాజరయ్యానని తెలిపారు. అయితే పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, అలాగే విచారణ ఎదుర్కొంటున్న దానం నాగేందర్ హాజరు కాకపోవడం ద్వారా బీజేపీ–కాంగ్రెస్ పార్టీల మధ్య తెరవెనుక రాజకీయ ఒప్పందాలు నేడు ప్రజలకు స్పష్టంగా కనిపిస్తున్నాయని విమర్శించారు.

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నాయని, దానం నాగేందర్‌తో పాటు మరో పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదని, ఉప ఎన్నికలు రావడం ఖాయమని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.

రాష్ట్రంలో, జిల్లాలో కొంతమంది అధికారులు బీఆర్ఎస్ నాయకులను వేధించడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. అలాంటి అధికారులందరికీ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తగిన విధంగా గుణపాఠం చెప్పడం ఖాయమని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గట్టిగా హెచ్చరించారు.