Subscribe Us

SB LATEST:

23, జనవరి 2026, శుక్రవారం

ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు


భారత స్వాతంత్ర్య ఉద్యమంలో తన అసమాన ధైర్యం, అచంచల దేశభక్తి, పోరాట పటిమతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మహానాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొల్లగూడెం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ఉప సర్పంచ్ బొల్లినేని గణేష్ గారి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి కొబ్బరికాయ కొట్టి ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, గ్రామస్తులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జీవితం దేశానికి అంకితమైందని గుర్తు చేశారు. “స్వాతంత్ర్యం ఎవరో ఇచ్చేది కాదు.. పోరాటంతోనే సాధించుకోవాలి” అనే ఆయన నినాదం నేటికీ ప్రతి భారతీయుడిని ఉద్యమపథంలో నడిపిస్తోందని తెలిపారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా రాజీ లేని పోరాటం చేసి, ఆజాద్ హింద్ ఫౌజ్‌ను స్థాపించి భారత స్వాతంత్ర్య సంగ్రామానికి కొత్త ఊపునిచ్చిన గొప్ప నాయకుడు నేతాజీ అని కొనియాడారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జీవన విధానం దేశభక్తి, ధైర్యం, క్రమశిక్షణకు ప్రతిరూపమని వక్తలు పేర్కొన్నారు. ఆయన చూపిన పోరాట మార్గం, నాయకత్వ లక్షణాలు యువతకు నేటికీ ఆదర్శనీయమని తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన మహానీయుడిగా నేతాజీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని అన్నారు.
ఈ సందర్భంగా ఉప సర్పంచ్ బొల్లినేని గణేష్ మాట్లాడుతూ, “నేతాజీ ఆశయాలను మనం మాటల్లోనే కాదు, కార్యాచరణలో కూడా అమలు చేయాలి. దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పనిచేయాలి. ముఖ్యంగా యువత దేశభక్తిని హృదయంలో నిలుపుకొని సమాజ సేవలో ముందుకు రావాలి” అని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు నేతాజీ గారి త్యాగాలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలకు అనుగుణంగా గ్రామాభివృద్ధి, సామాజిక సమానత్వం, జాతీయ ఐక్యత కోసం పనిచేయాలని సంకల్పం వ్యక్తం చేశారు. నేతాజీ చూపిన ధైర్యసాహసాలు, నాయకత్వ గుణాలు ఈ తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన రాసాల రామయ్య, రాసాల కొమరయ్య, తోట సత్యనారాయణ, పోతురాజు మూత్తయ్య, రాసాల రమేష్, దోసపాటి చింటూ, మునుకోటి ప్రమీల, జటంగి నగేష్, గజ్జి లోహిత్, డిస్ రవి, జెట్టి మధు, జక్కుల మనోజ్, బత్తుల నాగరాజు తదితర నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కార్యక్రమం అంతా దేశభక్తి నినాదాలతో, నేతాజీకి జయజయధ్వానాలతో ఉత్సాహభరితంగా సాగింది.