జయశంకర్ భూపాలపల్లి జిల్లా సంక్షేమ అధికారిగా పనిచేసి 10 నెలల క్రితం ఉద్యోగ విరమణ పొందిన చిన్నయ్య ప్రస్తుతం పేగు క్యాన్సర్‌తో మృత్యువుతో పోరాడుతున్నాడు. తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, 10 నెలలు గడిచినా తనకు రావాల్సిన రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ అందకపోవడంతో కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది.
హనుమకొండ రాంనగర్‌లో నివసిస్తున్న చిన్నయ్య, డీడబ్ల్యూవోగా రిటైర్ అయ్యాక సుమారు రూ.56 లక్షల రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ రావాల్సి ఉంది. ఈ బెనిఫిట్స్‌కు సంబంధించిన బిల్లులను జిల్లా ట్రెజరీ కార్యాలయం ద్వారా ప్రభుత్వానికి సమర్పించగా, అవి ఈ-కుబేర్‌లో పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు తెలిపారు. సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇస్తే మాత్రమే బెనిఫిట్స్ విడుదలవుతాయని చిన్నయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డబ్బుల కొరత కారణంగా క్యాన్సర్ చికిత్సకు అవసరమైన కీమోథెరపీ కూడా పూర్తిగా చేయించుకోలేకపోయాడు. హైదరాబాద్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ హాస్పిటల్లో నెల రోజులపాటు చికిత్స పొందగా సుమారు రూ.18 లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. ఇక చెల్లించే స్థోమత లేక ఇంటికి చేరాడు. ఇటీవల అప్పు చేసి ఒకసారి కీమో చేయించుకున్నప్పటికీ, మళ్లీ చికిత్స కొనసాగించేందుకు డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు.
ఇప్పటికే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నయ్యకు ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదు. కనీసం తనకు రావాల్సిన రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ కూడా విడుదల కాలేదని వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తన బెనిఫిట్స్ విడుదల చేసి తన ప్రాణాలను కాపాడాలని ఆయన కన్నీటితో వేడుకుంటున్నారు.
