అశ్వాపురం ప్రధాన రహదారిపై డివైడర్ ఇరువైపులా రోడ్డు విస్తరణ పనులు తీవ్రంగా ఆలస్యం అవుతున్న నేపథ్యంలో, ఈ సమస్యను మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారి దృష్టికి తీసుకువెళ్లారు. అశ్వాపురం మెయిన్ రోడ్డు వెంట రాకపోకలు పెరిగి, తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని వారు ఎమ్మెల్యేకు వివరించారు.
సమస్యపై స్పందించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు సంబంధిత ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌తో చరవాణిలో మాట్లాడి, రోడ్డు విస్తరణ పనులు వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు పనులు ఆలస్యం కావడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఇకపై ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని స్పష్టంగా సూచించారు.
ఈ సందర్భంగా సంబంధిత అధికారులు మాట్లాడుతూ, రెండు నుంచి మూడు రోజులలోపు అశ్వాపురం ప్రధాన రహదారిపై రోడ్డు విస్తరణ పనులను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. పనులు పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు తగ్గి, ప్రజలకు మరింత సౌకర్యంగా మారుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఓరుగంటి బిక్షమయ్య, సీనియర్ నాయకులు గాదె కేశవరెడ్డి, ఓరుగంటి రమేష్ బాబు, యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గొల్లపల్లి నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
