పినపాక:పిల్లలకు వ్యాక్సినేషన్ షెడ్యూల్ తప్పనిసరి అని పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు దుర్గా భవాని, జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు శృతి తెలిపారు. బుధవారం పినపాక జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాక్సిన్లు ఇవ్వడం అనేది పిల్లలను కేవలం వ్యక్తిగత వ్యాధుల నుంచి రక్షించడమే కాక రోగనిరోధక శక్తిని పెంచి సమాజాన్ని రక్షిస్తుందన్నారు. పోలియో, మీజిల్స్ (తట్టు), టీబీ (క్షయ), హెపటైటిస్ వంటి అనేక వ్యాధులు టీకాల కారణంగానే అదుపులోకి వచ్చాయన్నారు. అంతేకాదు ప్రాణాంతక వ్యాధుల నివారణకు రోగ నిరోధక శక్తి పెంపు ,ఆసుపత్రి ఖర్చుల తగ్గింపు, మెరుగైన బాల్యం, ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం టీకాలు తప్పనిసరిగా అవసరం అని వారు తెలిపారు. చిన్నారులను రక్షించేందుకు ప్రభుత్వం తప్పనిసరి చేసిన జాతీయ టీకా కార్యక్రమం గురించి ప్రతి తల్లిదండ్రి ఖచ్చితంగా తెలుసుకోవాలన్నారు. టీకా షెడ్యూల్ గురించి సమీపంలో గల ఆశా కార్యకర్తను గాని, పల్లె దవాఖానాల్లో గాని సంప్రదించవచ్చు అని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిరంతరం వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. పిల్లల ఆరోగ్య విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.
పిల్లలకు వ్యాక్సినేషన్ షెడ్యూల్ తప్పనిసరి: డాక్టర్ దుర్గా భవాని, డాక్టర్ శృతి
