భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం చింతకుంట గ్రామానికి చెందిన మడివి రాజి (23) అనే గర్భిణీ బుధవారం ఉదయం పురిటి నొప్పులతో బాధపడుతుండగా 108 అంబులెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పైలెట్ విజయభాస్కర్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ సుభద్ర వేగంగా సంఘటన స్థలానికి చేరుకున్నారు.
అయితే చింతకుంట గ్రామ రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్న కారణంగా అంబులెన్స్ ప్రయాణం క్లిష్టంగా మారింది. గోతులు, మురికివీధులు మధ్య అంబులెన్స్ నడిపి మహిళను హాస్పిటల్‌కి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే నొప్పులు పెరగడంతో వాహనాన్ని నిలిపి అంబులెన్స్‌లోనే ప్రసవం నిర్వహించారు. తల్లి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ సురక్షితంగా ఉన్నారని సుభద్ర తెలిపారు.
తరువాత వారిని మొరంపల్లి బంజర పీహెచ్‌సీకి తరలించారు. 108 అంబులెన్స్ సిబ్బంది సమయస్ఫూర్తి, సేవా భావానికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. అయితే, గ్రామ ప్రజలు తమ గోడును వ్యక్తం చేస్తూ— “ఏళ్ల తరబడి విన్నవించినా రోడ్లు మాత్రం సరిచేయలేదు, పాలకులు మారినా మా బతుకులు మాత్రం మారలేదని” ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే రోడ్లను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.
#108Ambulance #AdilabadNews #AdivasiLives #BhadrachalamUpdates #EmergencyRescue #MotherAndBabySafe #Burgampadu #TribalVillages #TelanganaNews
