భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలం, ఆగస్టు 23: కరకగూడెం మండలంలోని భట్టుపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) హాస్టల్‌లో కోతుల బెడదతో విద్యార్థులు, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గత కొంతకాలంగా హాస్టల్ పరిసరాల్లో కోతులు సంచరిస్తూ విద్యార్థులను భయపెట్టడంతో పాటు గదుల్లోకి ప్రవేశించి విద్యార్థులను గీకుతున్న ఘటనలు జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కోతులు హాస్టల్‌లోకి ప్రవేశించడంతో విద్యార్థుల భద్రతకు ముప్పు ఏర్పడుతోందని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు భయంతో గదుల్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. కోతుల దాడుల వల్ల విద్యార్థులకు గాయాలయ్యే ప్రమాదం ఉందని, అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు.
ఈ నేపథ్యంలో ఈ బయ్యారం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (FRO) ప్రత్యేక చొరవ తీసుకుని కేజీబీవీ హాస్టల్‌ను స్వయంగా సందర్శించి పరిస్థితిని పరిశీలించాలని విద్యార్థులు, సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు. కోతులకు ఎలాంటి హాని కలిగించకుండా, అటవీశాఖ నిబంధనలకు అనుగుణంగా వాటిని సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతంలోకి తరలించాలని కోరుతున్నారు.
అదే విధంగా భవిష్యత్తులో కోతులు హాస్టల్‌లోకి ప్రవేశించకుండా అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని, విద్యార్థులు, సిబ్బందికి అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. హాస్టల్ పరిసరాల్లో కోతుల సంచారం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు.
“అయ్యా.. ఒక్కసారి మా హాస్టల్‌కు వచ్చి పరిస్థితిని స్వయంగా చూడండి. మేము ప్రతిరోజూ భయంతో ఉంటున్నాం. మా భద్రత కోసం కోతులను సురక్షితంగా అడవిలోకి పంపించే చర్యలు తీసుకోండి” అంటూ కేజీబీవీ విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది అటవీశాఖ అధికారులను కోరుతున్నారు.
విద్యార్థుల భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, అటవీశాఖ అధికారులు వెంటనే హాస్టల్‌ను సందర్శించి కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు.
0 కామెంట్‌లు