విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలి: BJYM

విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలి: BJYM
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో విద్యార్థుల పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ BJYM ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు ధన్నోజు నరేష్ చారి నేతృత్వంలో విద్యార్థులతో కలిసి చేపట్టిన ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, విద్యార్థులు, యువమోర్చా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ ర్యాలీకి జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు వేముల నరేందర్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేందర్ గౌడ్ తదితరులు పాల్గొని విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా BJYM జిల్లా అధ్యక్షులు ధన్నోజు నరేష్ చారి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల ఫీజు బకాయిలు పేరుకుపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. విద్యార్థులకు రావాల్సిన స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను ఆలస్యం చేయకుండా తక్షణమే విడుదల చేయాలని కోరారు.

తెలంగాణవ్యాప్తంగా సుమారు 40 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందని నరేష్ చారి పేర్కొన్నారు. విద్యార్థులకు చెల్లించాల్సిన సుమారు రూ.15 వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడటం సమంజసం కాదని అన్నారు.

విద్యాశాఖ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై వెంటనే స్పందించాలని నరేష్ చారి కోరారు. విద్యార్థులకు రావాల్సిన బకాయిలను విడుదల చేసి వారి చదువులు సజావుగా కొనసాగేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. విదేశీ పర్యటనలు, ఇతర కార్యక్రమాల కంటే తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తుకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడిందని పేర్కొన్న ఆయన.. విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ప్రభుత్వం ప్రాధాన్యంగా తీసుకోవాలని కోరారు. బకాయిలు విడుదల చేయకపోతే విద్యార్థులు, యువతతో కలిసి మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

బీజేపీ జిల్లా అధ్యక్షులు వేముల నరేందర్ రావు మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తే దేశ భవిష్యత్తు అనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. విద్యార్థులకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ పనితీరును గమనిస్తున్నారని, విద్యార్థుల సమస్యలపైనా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుందని అన్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని నాయకులు తెలిపారు. విద్యార్థులకు హాల్‌టికెట్లు, సర్టిఫికెట్లు అందించడంలో కూడా సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చదువులు కొనసాగించేలా చూడాలని డిమాండ్ చేశారు.

జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుపేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థుల చదువులు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతోందని ఆచారి ఆందోళన వ్యక్తం చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించేందుకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోతే వారి విద్యాభ్యాసానికి తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని అన్నారు.

విదేశీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థుల పరిస్థితి కూడా ఇబ్బందికరంగా మారుతోందని ఆచారి పేర్కొన్నారు. స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

రాజకీయ స్వలాభాలను పక్కనపెట్టి విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆచారి సూచించారు. ప్రభుత్వం ఇకపై కాలయాపన చేయకుండా బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే విద్యార్థులు, యువత, ప్రజలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

విద్యార్థుల సమస్యలపై తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఆధ్వర్యంలో రెండు రోజుల నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు నాయకులు తెలిపారు. విద్యార్థుల హక్కుల కోసం బీజేపీ, BJYM నిరంతరం పోరాటం చేస్తాయని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేందర్ గౌడ్, గోరటి నరసింహ, బీజేపీ టౌన్ అధ్యక్షులు చవ్వ ప్రమోద్, జిల్లా ఉపాధ్యక్షులు బోడ నరసింహ, జిల్లా కార్యదర్శి రాంభూపాల్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దుర్గా ప్రసాద్, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి శ్రీను, జిల్లా నాయకులు నరేడ్ల శేఖర్ రెడ్డి, తాడూరు మండల అధ్యక్షులు చీల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

అలాగే యువమోర్చా నాయకులు విజేందర్ రెడ్డి, రాకేష్, అనిల్, రవి రాథోడ్, భగీరథ, నిశ్వంత్, శివాజీ, మిద్దె రవి, గోనెల శ్రీశైలం, మల్లేష్, సంతోష్, సాయి సాగర్, శివకుమార్, సాయి, అరవింద్, అరుణ్ కుమార్, భరత్, లక్ష్మీనరసింహతో పాటు పలువురు విద్యార్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుని నిధులను వెంటనే విడుదల చేయాలని BJYM నాయకులు డిమాండ్ చేశారు. బకాయిల విడుదలలో మరింత జాప్యం జరిగితే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు