ఏకలవ్య పాఠశాల వద్ద ఉద్రిక్తత. ఉన్నతస్థాయి విచారణకు ఆదివాసీ సంఘాల డిమాండ్

ఏకలవ్య పాఠశాల వద్ద ఉద్రిక్తత..

ఉన్నతస్థాయి విచారణకు ఆదివాసీ సంఘాల డిమాండ్

గుండాల మండలం ఆగస్టు 22 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి:

మండలంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్  ఎదుట తొమ్మిది  ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్ష శుక్రవారం ఉద్రిక్తతకు దారితీసింది. ఆదివాసీ గిరిజన విద్యార్థులపై జరుగుతున్న వివక్షను ఖండిస్తూ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ చుంచు రామకృష్ణ నాయకత్వంలో నాలుగు రోజులుగా కొనసాగుతున్న దీక్ష మరింత ఉధృతమైంది.ఈ నెల 14 వ తేదీన నిర్వహించిన తీజ్ పండుగను ఆదివాసీ సంఘాలు వ్యతిరేకించి అడ్డుకున్న నేపథ్యంలో కక్షపూరిత ధోరణితో కొందరు అధికారులు, సిబ్బంది ఆదివాసీ గిరిజన విద్యార్థులను వేధిస్తూ, కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా నిరసనకారులు పాఠశాల ప్రధాన గేటు దాటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.ఐతే ఈ సందర్భంగా ఆదివాసి తొమ్మిది తెగల చైర్మన్ చుంచు రామకృష్ణ మాట్లాడుతూ పాఠశాలలో నెలకొన్న పరిస్థితులపై ఉన్నతాధికారులు స్వయంగా వచ్చి సమగ్ర విచారణ నిర్వహించాలని, విద్యార్థుల భద్రతకు హామీ కల్పించాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని ఆదివాసీ విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు.అలాగే ఆదివాసీ విద్యార్థులపై జరుగుతున్న వివక్షకు బాధ్యులైన పాఠశాల ప్రిన్సిపాల్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని, స్థానిక భాష, సంస్కృతి తెలియని టీచింగ్ సిబ్బందిని తొలగించి వారి స్థానంలో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. పాఠశాలలో చోటుచేసుకున్న ఘటనలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.అనంతరం పాఠశాలకు చేరుకున్న  ఏపీఓ,ఆర్‌సీఓ లు నిరసనకారులతో చర్చించి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అయితే తమ డిమాండ్లపై స్పష్టమైన చర్యలు ప్రకటించే వరకు నిరాహార దీక్షను విరమించబోమని ఆదివాసీ సంఘాల నాయకులు స్పష్టం చేశారు.నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఈ నిరసన దీక్ష శుక్రవారం ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, వివాదానికి దారితీసిన అంశాలపై ఉన్నతస్థాయి విచారణ చేపట్టాలని ఆదివాసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. దీక్షలో వివిధ ఆదివాసీ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు