దీక్షకు దిగిన తొమ్మిది ఆదివాసీ తెగల జేఏసీ చైర్మన్ చుంచు రామకృష్ణ
స్పష్టమైన హామీ ఇవ్వడంలో విఫలమైన అధికారులు.. దీక్ష విరమించని ఆదివాసీ నాయకుడు
నిబంధనలకు విరుద్ధంగా తీజ్ పండుగ నిర్వహణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
సంపూర్ణ బందుకు సహకరించిన గుండాల ప్రజలు
జీవో నంబర్ 3ను పునరుద్ధరించి అమలు చేయాలి.
ఏకలవ్య పాఠశాలల్లో స్థానిక విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి.
*గుండాల మండలం, ఆగస్టు 19 (స్వాతంత్ర్య భారత్ ప్రతినిధి):*
గుండాల మండలం ముత్తాపురంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ వద్ద ఆదివాసీ సంఘాల ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివాసీల హక్కులు, విద్యా అవకాశాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానికుల హక్కుల పరిరక్షణతో పాటు పాఠశాలలో నిబంధనలకు విరుద్ధంగా తీజ్ పండుగ నిర్వహించారనే ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తొమ్మిది ఆదివాసీ తెగల జేఏసీ చైర్మన్ చుంచు రామకృష్ణ దీక్షకు దిగారు.
తీజ్ పండుగ ఏర్పాట్లకు బాధ్యులైన ఉపాధ్యాయులపై చట్టపరమైన చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని ఆదివాసీ తొమ్మిది తెగల జేఏసీ చైర్మన్ చుంచు రామకృష్ణ, తుడుం దెబ్బ జాతీయ ఉపాధ్యక్షుడు కోడెం వెంకటేశ్వర్లు, ఏఎస్‌పీ నాయకులు రమణబాబు, సర్పంచ్ రాధ డిమాండ్ చేశారు. పాఠశాలలో నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
స్థానిక విద్యార్థులపై దృష్టి పెట్టాలి
గుండాల ఏకలవ్య పాఠశాలలో స్థానిక ఆదివాసీ విద్యార్థులకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని చుంచు రామకృష్ణ ఆరోపించారు. 75 శాతం స్థానిక విద్యార్థులు ఉండాల్సిన చోట 10 శాతం కూడా స్థానిక విద్యార్థులు లేకపోవడంపై ఆయన అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశంపై అధికారుల సమక్షంలో చర్చ జరగగా, ఆదివాసీ విద్యార్థులకు అన్యాయం పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చినట్లు తెలిపారు.
అయితే సమస్యల పరిష్కారంపై అధికారులు స్పష్టమైన, లిఖితపూర్వక హామీ ఇవ్వకపోవడంతో దీక్షను విరమించేందుకు చుంచు రామకృష్ణ నిరాకరించారు. స్పష్టమైన హామీ వచ్చే వరకు దీక్ష కొనసాగిస్తామని ఆదివాసీ నాయకులు వెల్లడించారు.
“ఆదివాసీ అస్తిత్వం, హక్కుల కోసమే పోరాటం”
ఈ సందర్భంగా చుంచు రామకృష్ణ మాట్లాడుతూ.. “మన భూమి, మన అడవి, మన ఉద్యోగాలు, రాబోయే తరాల భవిష్యత్తు కోసం ఆదివాసులంతా ఐక్యంగా కదలాలి. ఈ పోరాటం ఒక ప్రాంతానికి పరిమితమైనది కాదు. ఆదివాసీల అస్తిత్వం, ఆత్మగౌరవం, రాజ్యాంగబద్ధమైన హక్కుల పరిరక్షణ కోసం చేస్తున్న పోరాటం” అని పేర్కొన్నారు.
ఆదివాసీల హక్కులు, గుర్తింపు, ఉద్యోగ అవకాశాల పరిరక్షణకు జీవో నంబర్ 3 పునరుద్ధరణతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ ఉద్యోగులపై బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
అధికారుల ఎదుట భావోద్వేగానికి గురైన రామకృష్ణ
ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయాలను అధికారులు, మీడియా దృష్టికి తీసుకెళ్లే క్రమంలో చుంచు రామకృష్ణ భావోద్వేగానికి గురయ్యారు. ఏకలవ్య పాఠశాలలో ఆదివాసీ విద్యార్థులకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చినప్పటికీ, సమస్యలపై స్పష్టమైన హామీ లేకపోవడంతో ఆందోళన కొనసాగించాలని నాయకులు నిర్ణయించారు.
గుండాలలో సంపూర్ణ బంద్
నిరసనలో భాగంగా బుధవారం గుండాల మండల కేంద్రంలో బంద్ నిర్వహించారు. బంద్‌కు మండల ప్రజలు సంపూర్ణ మద్దతు తెలపడంతో దుకాణాలు తెరుచుకోలేదు. ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా కనిపించాయి. ఆదివాసీ హక్కులు, విద్యా అవకాశాలు, ఉద్యోగాలు, భూముల పరిరక్షణకు సంబంధించి ప్రభుత్వం, అధికారులు తక్షణమే స్పందించి సమస్యలకు పరిష్కారం చూపాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. వారు ప్రధానంగా ఆదివాసీల అస్తిత్వం, రాజ్యాంగబద్ధమైన హక్కులను పరిరక్షించాలని, ఏజెన్సీ ఉపాధ్యాయ ఉద్యోగాల్లో స్థానిక ఆదివాసీలకు రక్షణ కల్పించే జీవో నంబర్ 3ను పునరుద్ధరించి అమలు చేయాలని, 1/70 చట్టాన్ని కఠినంగా అమలు చేసి ఆదివాసీ భూములు, వనరులను పరిరక్షించాలని, ఆదివాసీ ఉద్యోగులపై బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఏకలవ్య పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా జరిగే కార్యక్రమాలను నిలిపివేయాలని, తీజ్ పండుగ ఏర్పాట్లకు బాధ్యులైన ఉపాధ్యాయులపై విచారణ జరిపి, తప్పిదాలు నిర్ధారణైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఏకలవ్య పాఠశాలల్లో స్థానిక ఆదివాసీ విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రముఖంగా ప్రస్థావించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా జిల్లా అధ్యక్షులు వాగబోయిన చంద్రయ్య దొర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడెం వెంకటేశ్వర్లు, తుడుం దెబ్బ నాయకులు పూనెం శ్రీను, చింత వెంకటేశ్వర్లు, గోవిందా నర్సింహా రావు పినపాక జాయింట్ యాక్షన్ కమిటీ మండల అధ్యక్షులు వెంకట్ పెండకట్ల నాగరాజు తుడుం దెబ్బ రాష్ట్ర నాయకులు అలెం కోటి మోకాల వీరస్వామి సందీప్ తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు