ఏకలవ్య పాఠశాల ఎదుట ఆదివాసీ సంఘాల దీక్ష
గుండాల మండలం ఆగస్టు 20 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి:
మండలంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఎదుట ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న గిరిజన ఉపాధ్యాయులు పాఠశాలలో జరుగుతున్న విషయాలను బయటకు వెల్లడిస్తున్నారనే కారణంతో కొందరు లంబాడా ఉపాధ్యాయులు గిరిజన విద్యార్థులు, ఉపాధ్యాయుల పట్ల వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆదివాసీ సంఘాల నాయకులు ఆరోపించారు.
ఈ విధమైన వివక్షపూరిత ధోరణిని తీవ్రంగా ఖండిస్తూ దీక్ష చేపట్టినట్లు తెలిపారు. ఈ నెల 14న పాఠశాలలో నిర్వహించిన తీజ్ పండుగను ఆదివాసీ నాయకులు వ్యతిరేకించిన నేపథ్యంలో, పాఠశాలలో జరుగుతున్న అంశాలను గిరిజన ఉపాధ్యాయులు బయటకు చెప్పడం వల్లే తమ పండుగకు అడ్డుపడ్డారనే కారణంతో వారిపై కొందరు ఉపాధ్యాయులు వివక్ష చూపుతున్నారని ఆరోపించారు.
పాఠశాలలో గిరిజన విద్యార్థుల పట్ల అన్యాయం, ఒత్తిళ్లు, వేధింపులు జరుగుతున్నాయన్న ఆరోపణలపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
విద్యార్థులు, ఉపాధ్యాయుల సమస్యలను అధికారులు తక్షణమే పరిష్కరించి పాఠశాలలో ప్రశాంత వాతావరణం నెలకొల్పాలని కోరారు. సమస్యపై స్పష్టమైన హామీ ఇవ్వకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని ఆదివాసీ నాయకులు హెచ్చరించారు.
0 కామెంట్‌లు