అశ్వాపురం: యువత సోషల్ మీడియా మోజుకు దూరంగా ఉండి చదువుపై పూర్తి దృష్టి సారించాలని అశ్వాపురం ఎంపీడీవో ముత్యాలరావు యువత కు సూచించారు. చదువుకునే వయసులో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా వేదికల్లో గంటల తరబడి గడపడం వల్ల విలువైన సమయం వృథా అవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
యువత ఇప్పటికైనా మేల్కొని సోషల్ మీడియాకు కేటాయించే సమయాన్ని చదువుకు వినియోగిస్తే మంచి ర్యాంకులు సాధించి అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చని తెలిపారు. క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతోనే విజయాన్ని అందుకోవచ్చన్నారు.ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో కష్టాలు పడుతూ విద్యను అందిస్తున్నారని, ఆ త్యాగాలను గుర్తించి విద్యార్థులు బాధ్యతతో చదువుకోవాలని సూచించారు. సోషల్ మీడియా వ్యసనం వల్ల చదువుపై ఆసక్తి తగ్గి భవిష్యత్తు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. యువత తమ లక్ష్యాలను గుర్తుంచుకుని సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గించి విద్య, వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారించాలని ఎంపీడీవో ముత్యాలరావు పిలుపునిచ్చారు.
0 కామెంట్‌లు