SBNEWS, HYDERABAD: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన మహా ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన జర్నలిస్టులను అధికారికంగా ఉద్యమకారులుగా గుర్తించాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వారి సేవలు మరియు త్యాగాలకు తగిన గుర్తింపు, గౌరవం దక్కాలని ఆయన కోరారు.
మంగళవారం నాడు ట్యాంక్ బండ్‌లోని తెలంగాణ అమర జ్యోతిలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, గౌరవం, సంక్షేమంపై జర్నలిస్టులతో ఉద్యమ గుర్తింపు కమిటీ ఒక ప్రత్యేక సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని విరాహత్ అలీ ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమ కాలంలో జర్నలిస్టులు కేవలం వార్తా సేకరణకే పరిమితం కాలేదన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆవేదనలు మరియు ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పడంలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ప్రాంతీయ అన్యాయాలు, సామాజిక-ఆర్థిక అసమానతలను జాతీయ స్థాయిలో చర్చకు తీసుకురావడంతో పాటు, ఉద్యమానికి నైతిక బలాన్ని చేకూర్చడంలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిదని తెలిపారు.
ప్రత్యక్ష పోరులో జర్నలిస్టుల పాత్ర: చాలా ప్రాంతాల్లో జర్నలిస్టులు కేవలం వార్తలు రాయడమే కాకుండా... ఉద్యమకారులతో కలిసి ప్రత్యక్షంగా ర్యాలీలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పలుచోట్ల ఉద్యమ జాయింట్ యాక్షన్ కమిటీలకు (జేఏసీ) నాయకత్వం వహించిన దాఖలాలు ఉన్నాయని విరాహత్ అలీ పేర్కొన్నారు.
ఈ క్రమంలో వారు ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఉద్యమానికి కేంద్ర బిందువైన ఉస్మానియా యూనివర్సిటీతో సహా పలు ప్రాంతాలలో పోలీసులు జర్నలిస్టులపై లాఠీచార్జీలు జరిపారు. కెమెరాలను ధ్వంసం చేయడం, వార్తా సేకరణను అడ్డుకోవడం, అక్రమ కేసులు బనాయించడం, బెదిరింపులకు పాల్పడడం వంటి ఎన్నో వేధింపులను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ విధి నిర్వహణలో ఏమాత్రం వెనకడుగు వేయకుండా తెలంగాణ సాధనే లక్ష్యంగా పనిచేశారు.
వ్యక్తిగత త్యాగాలు: ఉద్యమంలో ప్రత్యక్షంగా భాగస్వాములు అయినందుకు పలువురు జర్నలిస్టులు తమ ఉద్యోగాలను సైతం కోల్పోవాల్సి వచ్చిందని విరాహత్ ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యాల ఒత్తిళ్లను ఎదుర్కొని, కొందరు స్వచ్ఛందంగా ఉద్యోగాలకు రాజీనామా చేసి మరీ తెలంగాణ ఉద్యమానికి అంకితమయ్యారని గుర్తుచేశారు. వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనపెట్టి సమాజం కోసం వారు చేసిన త్యాగాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు.
కమిటీకి వినతి పత్రం అందజేత: ఈ చారిత్రక అంశాలను, వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ఉద్యమకారుల ఎంపిక కమిటీ ఈ విషయాన్ని సానుభూతితో పరిశీలించాలని ఆయన కోరారు. ఉద్యమంలో సేవలందించిన అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఉద్యమకారులుగా అధికారిక గుర్తింపు కల్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా యూనియన్ తరఫున ప్రత్యేక వినతిపత్రాన్ని కమిటీ సభ్యులు ప్రొఫెసర్ కోదండరాం, రాములు నాయక్, శోభన్ రెడ్డిలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు