నీట్ పేపర్ లీక్‌పై దేశవ్యాప్త నిరసనలకు సీఐటీయూ మద్దతు

నీట్ పేపర్ లీక్‌పై దేశవ్యాప్త నిరసనలకు సీఐటీయూ మద్దతు
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్
కర్నూల్ (ఎస్‌బి న్యూస్): నీట్ పేపర్ లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని విద్యార్థి, యువజన సంఘాలు దేశవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలకు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు గురువారం స్థానిక సీఐటీయూ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐటీయూ పట్టణ అధ్యక్షుడు తిప్పన్న, పట్టణ కార్యదర్శి పీఎస్ గోపాల్, ఉపాధ్యక్షులు లక్ష్మన్న, కృష్ణమూర్తి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఆశతో రాసిన నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడం వల్ల వారి భవిష్యత్తు అనిశ్చితిలో పడిందన్నారు. ఈ ఘటనకు బాధ్యత వహించాల్సిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటికీ రాజీనామా చేయకపోవడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు.
నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యార్థి, యువజన సంఘాలు నిర్వహిస్తున్న నిరసనలను అణిచివేసే ప్రయత్నంలో పోలీసులు లాఠీచార్జ్‌కు పాల్పడడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి ఉందని, ఆ హక్కును కాలరాయడం సరైన చర్య కాదన్నారు.
విజయవాడలో రాజ్‌భవన్ ముట్టడికి వెళ్లిన విద్యార్థి, యువజన సంఘాల నాయకులపై పోలీసులు బలప్రయోగం చేయడాన్ని కూడా వారు ఖండించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వాలు వారిపై బలప్రయోగానికి దిగడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి, యువజన సంఘాలు చేపట్టిన విద్యాసంస్థల బంద్‌కు సీఐటీయూ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. నీట్ పేపర్ లీక్ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళనకు ముగింపు పలికేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని వారు కోరారు.

ఈ నిరసన కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు సి. ముక్కన్న, కే. నాగరాజు, ప్రసాద్, చంద్ర, అన్వర్, నాగేష్, భాష తదితరులు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు