గుండాలలో విద్యాసంస్థల బంద్ విజయవంతం...

గుండాలలో విద్యాసంస్థల బంద్ విజయవంతం...

నీట్ అవకతవకలు, విద్యార్థులపై లాఠీచార్జికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి: 
ఏఐఎస్ఎఫ్ ,పి డి ఎస్ యు,ఎన్‌ఎస్‌యూఐ, పివైఎల్  డిమాండ్...

మరణించిన విద్యార్థులకు కోటి రూపాయల నష్టపరిహారం కేంద్ర ప్రభుత్వం చెల్లించాలి..


యువతపై లాఠీఛార్జ్ చేయడానికి తీవ్రంగా ఖండించిన విద్యార్థులు .




గుండాల మండలం జులై 25 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి:

నీట్ పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలు, విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతున్న తీరు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎస్కే షాహిద్, పి డి ఎస్ యు జిల్లా సహాయ కార్యదర్శి ప్రేమ్ ఎన్‌ఎస్‌యూఐ మండల  అధ్యక్షులు బొబ్బిలి  పవన్ కళ్యాణ్ పి వై ఎల్ జిల్లా కార్యదర్శి పర్శిక రవి పి వై ఎల్ జిల్లా అధ్యక్షుడు పూణే మంగయ్య తెలిపారు.నీట్‌కు సంబంధించిన సమస్యలపై న్యాయం చేయాలని ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, యువతపై పోలీసులు లాఠీచార్జి చేయడం ప్రజాస్వామ్యాన్ని అవమానించే చర్య అని వారు తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన కేంద్ర ప్రభుత్వం వారిపై బలప్రయోగం చేయడం అత్యంత దుర్మార్గమని విమర్శించారు.నీట్ వ్యవహారంలో జరిగిన వైఫల్యాలకు పూర్తి బాధ్యత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వహించాలని, నైతిక బాధ్యత స్వీకరించి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును గాలికి వదిలేసి, ప్రశ్నించిన వారిపై లాఠీలు ఎత్తడం బీజేపీ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు.నీట్ వ్యవహారం, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి నష్టపరిహారం చెల్లించాలని, వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల మరణాలకు కారణమైన పరిస్థితులపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నిష్పాక్షిక విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ నేపథ్యంలో వామవాక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైందని తెలిపారు. బంద్‌కు సహకరించిన విద్యార్థులు, యువజనులు, ఉపాధ్యాయులు,విద్యాసంస్థల యాజమాన్యాలకు వారు కృతజ్ఞతలు తెలిపారు.ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల ఆవేదనను గుర్తించి, వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని, లేకపోతే దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు ఎస్కే నాసిర్ యశ్వంత్ షబ్బీర్ అజ్మత్ పి డి ఎస్ యు నాయకులు షాహిద్ రాహుల్ హర్ష రామకృష్ణ పీడీఎస్యు పి వై ఎల్ నాయకులు  సనప కుమార్ కల్తీ సుదర్శన్ వాసు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు