మరణం లేని ప్రజా గాయకుడు, పాట రూపంలో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడు
గుండాల మండలం జులై 11 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి:
అరుణోదయ సాంస్కృతికోద్యమ సేనాని, ప్రజా గాయకుడు, విప్లవ కళాకారుడు కామ్రేడ్ అరుణోదయ నాగన్న మరణం ఒక వ్యక్తి మరణం మాత్రమే కాదని, ప్రజా సాంస్కృతికోద్యమానికి తీరని లోటని పలువురు ప్రజా సంఘాల నాయకులు, కళాకారులు, అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. నాగన్న భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన ఆలపించిన ప్రతి పాటలో, ప్రజల కోసం చేసిన ప్రతి ప్రదర్శనలో, సమాజ మార్పు కోసం వెలిగించిన ప్రతి చైతన్య జ్యోతిలో చిరకాలం జీవిస్తూనే ఉంటారని నివాళులర్పించారు.
ఖమ్మం జిల్లా రాజారం గ్రామంలో జన్మించిన పరకాల నాగన్న, తరువాత కాలంలో "అరుణోదయ నాగన్న"గా గోదావరి లోయ ప్రాంతమంతా ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్నారు. పేద కుటుంబంలో జన్మించి, పాలేరు జీవితం నుంచి ప్రజల కష్టాలను దగ్గరగా చూసిన ఆయన, ప్రముఖ ప్రజా కళాకారుడు కానూరి ప్రభావంతో ప్రజా గీతాల వైపు అడుగులు వేశారు. అనంతరం పార్టీ పూర్తి కాలం కార్యకర్తగా మారి, తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేశారు.
భూస్వామ్య వ్యవస్థ, సామాజిక అసమానతలు, దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా తన గళాన్ని ఆయుధంగా మలుచుకున్న నాగన్న, అమరవీరుల త్యాగాలను గీతాల రూపంలో ప్రజలకు చేరవేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా సమస్యలపై నాటికలు, బుర్రకథలు, జానపద గేయాల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపారు. ఆయన పాటలు కేవలం వినోదం కోసం కాకుండా, సామాజిక మార్పు కోసం సాగిన ఉద్యమాలకు ఊపిరిగా నిలిచాయి.
తెలంగాణ, గోదావరి లోయ ప్రాంతాల్లో అనేక ఉద్యమాల్లో పాల్గొన్న నాగన్న, తన కళను ప్రజల పక్షాన నిలబెట్టి సాంస్కృతికోద్యమానికి కొత్త దిశను చూపించారు. కష్టజీవుల కన్నీటి వెనుక ఉన్న బాధను, వారి ఆశయాలను తన గాత్రంలో పలికించిన అరుదైన ప్రజా కళాకారుడిగా ఆయన గుర్తింపు పొందారు.
కామ్రేడ్ అరుణోదయ నాగన్న భౌతికంగా దూరమైనా, ఆయన పాడిన విప్లవ గీతాలు, ప్రజల్లో రగిలించిన చైతన్యం, సమాన సమాజం కోసం చేసిన కృషి ఎప్పటికీ మరువలేనివని నాయకులు పేర్కొన్నారు. భావితరాల ప్రజా కళాకారులకు ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని, సమాజ మార్పు కోసం కళను ఆయుధంగా ఎలా మలచుకోవాలో నాగన్న జీవితం ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు.
అరుణోదయ నాగన్న వంటి ప్రజా కళాకారులు శరీరంగా మరణించినా, వారి ఆశయాలు, ఆలోచనలు, పాటలు, పోరాట స్ఫూర్తి ఎన్నటికీ మరణించవని పేర్కొంటూ ఆయనకు విప్లవ జోహార్లు అర్పించారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఆ గళం ఇకపై ప్రతి ఉద్యమంలో, ప్రతి జానపద గీతంలో, ప్రతి న్యాయ పోరాటంలో ప్రతిధ్వనిస్తూనే ఉంటుందని భావోద్వేగంతో నివాళులర్పించారు.
0 కామెంట్‌లు