భద్రాచలంలో ఘనంగా 'నషా ముక్త్ యువ్ ఫర్ వికసిత్ భారత్' జిల్లా స్థాయి పోటీలు

భద్రాచలంలో ఘనంగా 'నషా ముక్త్ యువ్ ఫర్ వికసిత్ భారత్' జిల్లా స్థాయి పోటీలు
భద్రాచలం, ఆగస్టు 1 (ఎస్‌బి న్యూస్): యువతలో మాదకద్రవ్యాల వ్యసనాన్ని నిర్మూలించి, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడే లక్ష్యంతో నిర్వహిస్తున్న 'నషా ముక్త్ యువ్ ఫర్ వికసిత్ భారత్' జిల్లా స్థాయి పోటీలు భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాచలం ప్రధాన న్యాయమూర్తి బీ.సీ. శివ నాయక్ హాజరయ్యారు. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జాన్ మిల్టన్ అధ్యక్షత వహించగా, మేర యువ భారత్ కన్వీనర్ రాంబాబు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ బి. కామేశ్వరరావు ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ, యువత దేశ భవిష్యత్తు అని, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటేనే వ్యక్తిగత జీవితంతో పాటు సమాజం కూడా అభివృద్ధి చెందుతుందని అన్నారు. విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతలను అలవర్చుకోవాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిని మాత్రమే కాదు కుటుంబాన్ని, సమాజాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. అలాంటి దుష్ప్రవర్తనలకు యువత దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.

పోటీల్లో భాగంగా విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. నృత్యం, సంగీతం, షార్ట్ ఫిల్మ్, వక్తృత్వం, కవితా రచన, పెయింటింగ్, నాటకం, స్లోగన్ రైటింగ్ వంటి విభాగాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలన, ఆరోగ్యకరమైన జీవన విధానం, సమాజంలో అవగాహన పెంపొందించే అంశాలపై విద్యార్థులు తమ సృజనాత్మకతను ప్రదర్శించారు.

జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అర్హత సాధిస్తారని నిర్వాహకులు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో కూడా ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అతిథులు విద్యార్థులను అభినందించారు.

కళాశాలలోని మాదకద్రవ్యాల నిరోధక కమిటీ కన్వీనర్ బి. సుధాకర్ రావు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎన్. కిరణ్ కుమార్ కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. కార్యక్రమం విజయవంతం కావడానికి అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది సమన్వయంతో కృషి చేశారు.

ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలకు చెందిన విద్యార్థులు, అధ్యాపకులు, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోటీల ద్వారా విద్యార్థుల్లో సామాజిక చైతన్యం, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు మరింత పెంపొందుతాయని అతిథులు అభిప్రాయపడ్డారు.

చివరగా విజేతలకు అభినందనలు తెలియజేస్తూ, రాష్ట్ర స్థాయిలోనూ అత్యుత్తమ ప్రతిభ కనబర్చి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో ముగిసింది

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు