మండల ప్రజలకు కొమరం శాంతన్న పిలుపు
గుండాల మండలం ఆగస్టు 1 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి:
గుండాల మండల కేంద్రంలో ఆగస్టు 3న సీపీఐ (ఎం ఎల్) మాస్ లైన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మండల జనరల్ బాడీ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ మండల కార్యదర్శి, గుండాల మాజీ సర్పంచ్ కొమరం శాంతన్న పిలుపునిచ్చారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, మండల జనరల్ బాడీ సమావేశానికి పార్టీ రాష్ట్ర నాయకులు గుమ్మడి నర్సయ్య, చండ్ర అరుణ ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతింటున్నాయని, ప్రజల సమస్యలను ప్రశ్నించే గొంతుకలపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థలో అవకతవకలు, వివిధ శాఖల్లో అవినీతి, ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా సాధారణ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రజల హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం పోరాటాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న మండల జనరల్ బాడీ సమావేశానికి పార్టీ శ్రేణులు, ప్రజాసంఘాల నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.
0 కామెంట్‌లు