ఆదోని: ఆదోనిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షలు నూరు గంటలు పూర్తి చేసుకున్నాయి. దీక్షలో పాల్గొంటున్న ఆదినారాయణ రెడ్డి, మల్లికార్జున ఆచారి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారిందని ఉద్యమ నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా సాధన సమితి నాయకులు మాట్లాడుతూ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదోని పర్యటన సందర్భంగా ఉద్యమానికి దూరమైన వ్యక్తులతో కాకుండా జిల్లా సాధన సమితి ప్రతినిధులతోనే చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఉద్యమానికి తూట్లు పొడిచిన వారితో చర్చలు జరుపుతున్నట్లు కూటమి నాయకులు చెబుతున్నారని, అలాంటి చర్యలు ఉద్యమ స్ఫూర్తిని దెబ్బతీస్తాయని విమర్శించారు.
నిన్న రాత్రి ఆదోని ఎమ్మార్వో దీక్షా శిబిరానికి వచ్చి దీక్షను విరమించాలని కోరారని, దీనిపై నాయకులతో చర్చలు జరిగినట్లు తెలిపారు. అయితే, ఆదోనిని జిల్లా కేంద్రంగా ప్రకటిస్తామని స్పష్టమైన హామీ ఇస్తేనే దీక్షను విరమిస్తామని, లేకపోతే శిబిరాన్ని కొనసాగిస్తామని తాము స్పష్టం చేసినట్లు వెల్లడించారు.
అదేవిధంగా, ఏవైనా చర్చలు జరపాలంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్వయంగా దీక్షా శిబిరానికి వచ్చి జిల్లా సాధన సమితి నాయకులతో మాట్లాడాలని డిమాండ్ చేశారు. ఉద్యమాన్ని పక్కన పెట్టి ఇతరులతో చర్చలు జరపడం సరైన విధానం కాదని పేర్కొన్నారు.
దీక్షలో కూర్చున్న వారి ఆరోగ్య పరిస్థితి మరింత విషమిస్తే అందుకు కూటమి ప్రభుత్వం, స్థానిక నాయకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సాధన సమితి నాయకులు జైభీమ్ సాయిరాం, పగడాల కోదండ, వై.పీ. నాగరాజ్ పాల్గొన్నారు. అలాగే నిరాహార దీక్షలో ఆదినారాయణ రెడ్డి, మల్లికార్జున ఆచారి, సుభాష్ చంద్రబోస్, కుమారస్వామి తదితరులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు.
– స్వతంత్ర భారత్ రిపోర్టర్, స్వామిదాసు, ఆదోని
0 కామెంట్‌లు