ప్రజా పోరాటానికి ఫలితం.. ఆవు దూడ వంకపై వంతెన నిర్మాణానికి టెండర్ ప్రక్రియ ప్రారంభం

ప్రజా పోరాటానికి ఫలితం.. ఆవు దూడ వంకపై వంతెన నిర్మాణానికి టెండర్ ప్రక్రియ ప్రారంభం
సీపీఐ 8వ రోజు రిలే నిరాహార దీక్షలు ఫలించాయి
ఆదోని, జూన్ 29: ఆర్.ఆర్. లేబర్ కాలనీ ప్రజల రాకపోకలకు ప్రమాదకరంగా మారిన ఆవు దూడ వంకపై నూతన వంతెన నిర్మించాలని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు, ధర్నా ఉద్యమం ఫలించింది. సోమవారం నాటికి దీక్షలు 8వ రోజుకు చేరుకోగా, వంతెన నిర్మాణానికి జూలై 3న టెండర్ ప్రక్రియ ప్రారంభిస్తామని మున్సిపల్ అధికారులు హామీ ఇచ్చారు.

సీపీఐ పట్టణ కార్యదర్శి టి. వీరేష్, సహాయ కార్యదర్శి కె. రమేష్ కుమార్, పార్టీ నాయకులు శివప్ప, ఆటో విజయ్, ఆర్. ఆటో యూనియన్ నాయకుడు ఎన్. ఈరన్న, డీహెచ్‌పీఎస్ జిల్లా సమితి సభ్యుడు ఎ. విజయ్ కుమార్, ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి జి. అంజిత్ గౌడ్, ప్రజానాట్య మండలి నాయకుడు కె. ఈరన్న ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగాయి. ఆర్.ఆర్. లేబర్ కాలనీకి చెందిన పలువురు స్థానికులు దీక్షలకు సంఘీభావం తెలుపుతూ పాల్గొన్నారు.

అనంతరం మున్సిపల్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాకు స్పందించిన మున్సిపల్ కమిషనర్, ఇంజినీరింగ్ అధికారులు సీపీఐ ప్రతినిధులతో చర్చించారు. ఈ సందర్భంగా జూలై 3న వంతెన నిర్మాణానికి అవసరమైన టెండర్ ప్రక్రియ ప్రారంభించి, అనంతరం నిర్మాణ పనులు చేపడతామని స్పష్టమైన హామీ ఇచ్చారు.

ప్రజా ఉద్యమానికి లభించిన విజయంగా ఈ నిర్ణయాన్ని సీపీఐ నాయకులు అభివర్ణించారు. అధికారుల హామీ అమలయ్యే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని, నిర్ణీత గడువులో పనులు ప్రారంభం కాకపోతే ప్రజలతో కలిసి మరింత ఉధృతంగా పోరాటం చేపడతామని హెచ్చరించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు