వీరాపురం ఇసుక రీచ్ కేటాయింపులో గిరిజన మహిళా సంఘానికి అన్యాయం జరుగుతోందని ఆరోపణ


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం దుగినేపల్లి గ్రామానికి చెందిన "శ్రీగిరి లక్ష్మి ఇసుక క్వారీ ట్రైబల్ లేబర్ కాంట్రాక్ట్ సహకార సంఘం లిమిటెడ్" సభ్యులు వీరాపురం ఇసుక రీచ్ కేటాయింపు విషయంలో తమ సంఘానికి అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం పినపాక మండలం శేఖర్ సిల గ్రామంలో బాధితుల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తుడుం దెబ్బ రాష్ట్ర నాయకులు ఆలం కోటి మాట్లాడుతూ 1964 చట్టం ప్రకారం నమోదైన తమ సంఘం ఎన్నో ఏళ్లుగా గిరిజన మహిళలకు ఉపాధి కల్పిస్తూ ప్రభుత్వ అనుమతులతో ఇసుక కార్యకలాపాలు నిర్వహించిందని తెలిపారు.

వీరాపురం ఇసుక రీచ్‌కు సంబంధించి 2025 మే 19న జిల్లా స్థాయి ఇసుక కమిటీ 1,85,500 క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలకు ఆమోదం ఇచ్చిందని, అయితే ఆ ఉత్తర్వుల్లో ఏ సొసైటీ పేరును ప్రస్తావించలేదని పేర్కొన్నారు. అనంతరం రెండు గిరిజన మహిళా సంఘాలు ఉన్నాయని అధికారులు గుర్తించినప్పటికీ, తమకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, అభిప్రాయం తీసుకోకుండా గ్రామపంచాయతీ ఏకపక్షంగా మరో సంఘానికి అనుకూలంగా తీర్మానం పంపిందని ఆరోపించారు.
గ్రామసభ చట్టబద్ధంగా నిర్వహించబడిందా లేదా అనే అంశంపై కూడా అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఈ విషయంపై కలెక్టర్, జిల్లా సహకార అధికారి , తెలంగాణ గనుల అభివృద్ధి సంస్థ అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.వివాదం పూర్తిగా పరిష్కారమయ్యే వరకు వీరాపురం ఇసుక రీచ్‌కు సంబంధించి వర్క్ ఆర్డర్ జారీ చేయకుండా నిలిపివేయాలని, రెండు సంఘాలకు సమాన అవకాశాలు కల్పించాలని, గ్రామపంచాయతీ తీర్మానం చట్టబద్ధతపై విచారణ జరిపి తమ సంఘానికి వినికిడి అవకాశం కల్పించాలని సంఘ ప్రతినిధులు డిమాండ్ చేశారు. గిరిజన మహిళల జీవనోపాధి, హక్కులను పరిరక్షించే విధంగా అధికారులు న్యాయమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు